బతుకు నిజాన్ని ఈదుకుంటూ..

బతుకు నిజాన్ని ఈదుకుంటూ..నిద్రపట్టక ఓ రాత్రి గొంతు పట్టుకుని
నల్లని మేఘమై మనసు కాలు దువ్వి
ఆ రాత్రి మొత్తం కుండపోతగా కురిసా..
మెడలోతు నీళ్ళకు గది మునిగింది.
ఉండలేక ఉదయానికి ఈత కొట్టుకుని బయటకొస్తే
తట్టుకోలేని ఈర్ష్య తాపం, అసూయా గాడ్పులకు
మళ్ళీ లోపలికి వెళ్ళా…
ఈసారి ఎంత కురుద్దామన్నా మనసు కరుడుకట్టి,
భావాలు పిడచగొట్టి నెర్రలై పోయాను..
ఇప్పుడు రాత్రి ఎడారి పగలు సముద్రం
ఎంత మేల్కొన్న చుక్క రాల్చని మేఘం
ఎంత లోతుకెళ్ళిన బొట్టు కరుణించని కెరటం
వీటి మధ్య జీవితమే.
జీవితమంతే అని తెలిసి బతుకు నిజాన్ని ఈదుకుంటూ
జీవితం వైపు వెళ్ళిపోయింది.
– శ్రీ సాహితి