ఫైనల్‌కు స్వైటెక్‌

Switech for the final– సెమీస్‌లో గాఫ్‌పై గెలుపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి పోలండ్‌కు చెందిన టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌ ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో స్వైటెక్‌ 6-2, 6-4తో 3వ సీడ్‌, అమెరికా సంచలనం కోకా గాఫ్‌పై వరుససెట్లలో విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన స్వైటెక్‌.. రెండోగేమ్‌లో ఒక బ్రేక్‌ పాయింట్‌తో మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో గాఫ్‌ మూడు ఏస్‌లను సంధించినా ప్రయోజనం లేకపోయింది. అలాగే నాలుగు డబుల్స్‌ ఫాల్స్‌ కూడా గాఫ్‌ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. శనివారం జరిగే టైటిల్‌ పోరులో స్వైటెక్‌.. పోలిని(ఇటలీ), ఆండ్రీవా(రష్యా) మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.
జకోవిచ్‌ సర్జరీ సక్సెస్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి గాయం కారణంగా వైదొలిగిన టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. తన కుడి మోకాలికి విజయవంతంగా ఆపరేషన్‌ అయిందని గురువారం జకోవిచ్‌ వెల్లడించాడు. త్వరగా కోలుకొని కోర్టులో అడుగుపెడుతానని ట్విటర్‌(ఎక్స్‌)లో పోస్ట్‌ చేశాడు. ‘మోకాలి గాయం కారణంగా క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ ఆడకుండానే వైదొలగాల్సి వచ్చింది. నాకు సర్జరీ సక్సెస్‌ అయింది. ఈ కష్ట సమయంలో నాకు అన్నివిధాలా తోడుగా ఉన్న వైద్య బృందానికి, నాకు మద్ధతుగా నిలుస్తున్న అభిమానులకు అభినందనలు. త్వరలోనే కోర్టులో అడుగుపెడుతాను’ అని జకోవిచ్‌ తెలిపాడు. జూలై 1 నుంచి జరిగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌తోపాటు జూలై 27 నుంచి జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో జకోవిచ్‌ ఆడే చాన్స్‌ విషయం ఆ తర్వాత తెలియపరుస్తానన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో జకోవిచ్‌ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కాపర్‌ రూడ్‌తో బుధవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్లో మోకాలి గాయం కారణంగా మ్యాచ్‌ ముందే కోర్టును వీడాడు. 2023లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లుకొల్లగొట్టిన జకో.. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో 24గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో నయా చరిత్ర సృష్టించాడు. అలాగే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు.