సెమీస్‌లో స్వైటెక్‌

– బీట్రిజ్‌ మైయతో ఢకిీ సిద్ధం
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌)
డిఫెండింగ్‌ చాంపియన్‌, టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్‌పై వరుస సెట్లలో విజయం సాధించిన ఇగా స్వైటెక్‌ టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. బ్రెజిల్‌ భామ బీట్రిజ్‌ హదాద్‌ మైయ కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. 1968 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రెజిల్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బీట్రిజ్‌.. క్వార్టర్స్‌లో ఓన్స్‌ జాబెర్‌ (ట్యూనిషియ)పై మూడు సెట్ల మ్యాచ్‌లో మెరుపు విజయంతో ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రెజిల్‌ క్రీడాకారిణిగా నిలిచింది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఇగా స్వైటెక్‌తో బీట్రిజ్‌ హదాద్‌ మైయ..కరొలినా ముచోవతో సబలెంక తలపడనున్నారు.
స్వైటెక్‌ ఎదురేదీ?
టైటిల్‌ ఫేవరేట్‌ ఇగా స్వైటెక్‌కు ఎదురు లేదు!. క్వార్టర్స్‌లో కొకొ గాఫ్‌ సైతం ఆమెకు పోటీ ఇవ్వలేదు. 6-4, 6-2తో స్వైటెక్‌ అలవోక విజయం సాధించింది. నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌.. పాయింట్ల పరంగా 60-41తో పైచేయి సాధించింది. స్వైటెక్‌ 19 విన్నర్లు కొట్టగా.. గాఫ్‌ 13 విన్నర్లు మాత్రమే కొట్టింది. 23 అనవసర తప్పిదాలు చేసిన కొకొ గాఫ్‌.. సెమీస్‌ బెర్త్‌ను స్వైటెక్‌కు కోల్పోయింది. బ్రెజిల్‌ స్టార్‌ బీట్రిజ్‌ హదాద్‌ మైయ జోరు కొనసాగుతుంది. ట్యూనిషియ అమ్మాయి ఓన్స్‌ జాబెర్‌పై మైయ మూడు సెట్ల మ్యాచ్‌లో నెగ్గింది. 149 నిమిషాల ఉత్కంఠ క్వార్టర్స్‌లో బీట్రిజ్‌ 28 విన్నర్లే కొట్టగా.. జాబెర్‌ ఏకంగా 38 విన్నర్లు సాధించింది. ఇక పాయింట్ల పరంగా జాబెర్‌, బీట్రిజ్‌ 107-107తో సమవుజ్జీలుగా నిలిచారు. బీట్రిజ్‌ ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. జాబెర్‌ నాలుగు బ్రేక్‌ పాయింట్లే సాధించింది. బీట్రిజ్‌ 16 గేములు గెలుపొందగా.. జాబెర్‌ 13 సొంతం చేసుకుంది. 3-6, 7-6(7-5), 6-1తో ఓన్స్‌ జాబెర్‌పై బీట్రిజ్‌ హదాద్‌ మైయ చిరస్మరణీయ విజయం నమోదు చేసింది.