– ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
– మూడో రౌండ్లో టాప్ సీడ్
– రెండో రౌండ్లో నాగల్ ఓటమి
వరల్డ్ నం.1, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ దూకుడు పెంచింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయంతో మూడో రౌండ్లో అడుగుపెట్టింది. భారత సంచలనం సుమిత్ నాగల్ జోరుకు రెండో రౌండ్‌లోనే బ్రేక్ పడింది. చైనా ఆటగాడితో ఉత్కంఠ పోరులో సుమిత్ నాగల్ పోరాడి ఓడాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ఆటగాడిపై విజయంతో పాటు రూ.1 కోటి నగదు బహుమానంతో స్వదేశానికి రానున్నాడు.
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్ (పోలాండ్) దూసుకుపోతుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పోలాండ్ భామ మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. అమెరికా అమ్మాయి డానిలీ కొలిన్స్‌పై 6-4, 3-6, 6-4తో గెలుపొందింది. ఓ ఏస్ కొట్టిన స్వైటెక్.. నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసింది. కొలిన్స్ ఆరు సార్లు స్వైటెక్ సర్వ్‌ను బ్రేక్ చేసి భయపెట్టిగా.. స్వైటెక్ ఏడు సార్లు సర్వ్‌ను బ్రేక్ చేసి పైచేయి సాధించింది. పాయింట్ల పరంగా 104-100తో స్వైటెక్‌కు కొలిన్స్ గట్టి పోటీ ఇచ్చింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకరైన ఎలెనా రిబకినా కఠిన పోరులో పరాజయం పాలైంది. కజకిస్థాన్ స్టార్ రెండో రౌండ్లో 4-6తో తొలి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ.. 6-4తో రెండో సెట్‌లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్ టైబ్రేకర్‌కు దారితీసింది. 6-6తో రిబకినా, అనా బ్లింకోవా సమవుజ్జీలుగా నిలిచారు. ఈ దశలో 22-20తో సూపర్ టైబ్రేకర్‌లో బ్లింకోవా పైచేయి సాధించింది. రిబకినాను ఇంటిముఖం పట్టించింది. ఇంగ్లాండ్ స్టార్ ఎమ్మా రాడుకాను సైతం నిష్క్రమించింది. చైనా అమ్మాయి వాంగ్ యఫాన్ 6-4, 4-6, 6-4తో ఎమ్మాపై అదిరే విజయం నమోదు చేసింది. అమెరికా క్రీడాకారిణి స్లోనె స్టీఫెన్స్ 4-6, 6-3, 6-3తో రెండో రౌండ్లో గెలుపొందింది. డరియ కసట్కినాపై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. 11వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో 6-0, 3-6, 6-4తో లోకల్ స్టార్ అజ్లాను ఓడించి మూడోరౌండ్‌కు చేరుకుంది. విక్టోరియ అజరెంక 6-4, 3-6, 6-2తో క్లారాపై గెలుపొందింది. ఎలిని స్విట్లోవా 6-1, 6-3తో వరుస సెట్లలో విక్టోరియ తోమోవపై అలవోక విజయం సాధించింది.
నాగల్ ఓటమి
మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ సుమిత్ నాగల్ జోరుకు తెరపడింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో చైనా ఆటగాడు షాంగ్ చేతిలో నాలుగు సెట్ల పోరులో నిరాశపరిచాడు. 6-2తో తొలి సెట్‌ను గెల్చుకున్న నాగల్.. విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ వరుసగా మూడు సెట్లలో 3-6, 5-7, 4-6తో నిరాశపరిచి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమిత్ నాగల్ రెండో రౌండ్‌కు చేరుకుని కనీసం సుమారు రూ.1 కోటి ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మారథాన్ మ్యాచ్‌లో గట్టెక్కాడు. 7-5, 3-6, 4-6, 7-6(7-5), 7-6(10-7)తో లుకాస్ క్లెన్ (క్రోయేషియా)పై పైచేయి సాధించాడు. రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ సైతం మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. 6-4, 6-7(3-7), 6-3, 7-6(7-3)తో లోరెంజో సోనెగపై గెలుపొందాడు. 11వ సీడ్ ఆటగాడు కాస్పర్ రూడ్ 6-3, 6-7(5-7), 6-3, 3-6, 7-6(10-7) ఐదు సెట్ల సమరంలో మాక్స్ పర్సెల్‌ను ఓడించాడు. రష్యా స్టార్,3వ సీడ్ డానిల్ మెద్వదేవ్ సైతం ఐదు సెట్ల పోరాటం చేశాడు. 3-6, 6-7(1-7), 6-4, 7-6(7-1), 6-0తో ఎమిల్‌పై గెలుపొందాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడినా.. వరుసగా మూడు సెట్లలో పైచేయి సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.