– జిల్లాలో విస్తారంగా వర్షాలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలో సోమవారం సాయంత్రం నుండి విస్తారంగా వర్షాలు కురువగా మంగళవారం నాటికి పలు మండలాల్లో వాగులు ఉప్పొంగి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు 44.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురిసింది. దీనితో ఆసిఫాబాద్ మండలంలోని అప్పపెల్లి, గుండి గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న వాగులు ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో వాటి సంబంధాలు తెగిపోయాయి. రెండు రోజుల వర్షానికి ఎక్కడికక్కడ గ్రామాలు నిర్బంధంలో చిక్కుకుపోవడంతో గ్రామస్తులు ప్రతి సంవత్సరం తాము వేదన పడుతున్నామని అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పపెల్లి గ్రామానికి గతంలో కనీసం వాగు ప్రవాహం తగ్గినప్పుడైనా వెళ్లేలా ఉండేది. ప్రస్తుతం బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో గ్రామస్తులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో సగటు 44.5 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియగా మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జైనూర్‌లో 39.2, సిర్పూర్(యు)లో 47.4, లింగాపూర్‌లో 91.2, తిర్యాణిలో 41.6, రెబ్బెనలో 66.0, ఆసిఫాబాద్‌లో 90.2, కెరమెరిలో 76.6, వాంకిడిలో 40.4, కాగజ్‌నగర్‌లో 41, సిర్పూర్(టి)లో 59.4, కౌటాలలో 3.4, చింతలమానపెల్లి 7.6, బెజ్జూర్‌లో 7.4, పెంచికలపేట 4.6, దహేగాం 4.4 మీమీల వర్షపాతం నమోదైంది.