– రూ.100కు 60 కి.మీ., అప్ అండ్ డౌన్ ప్రయాణం
– పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్లకు వర్తింపు
– రేపటి నుంచి అమల్లోకి…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే అమల్లో ఉన్న ట్రావెల్ యాజ్ యూ లైక్ (టీవైఎల్) టిక్కెట్లు ఇకపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. తొలి దశలో పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్లకే ఈ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో రూ.100 పెట్టి టీ-9 టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానూ పోనూ ప్రయాణం చేయవచ్చు. ఆదివారం (ఈనెల 18వ తేదీ) నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఈ టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారంనాడిక్కడి బస్‌భవన్‌లో టీ-9 టిక్కెట్ల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ టిక్కెట్ తీసుకున్న మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చేయవచ్చని వివరించారు. దీనివల్ల గ్రామీణ ఆర్టీసీ ప్రయాణీకులకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందన్నారు. ఈ టిక్కెట్లకు టోల్‌గేట్ చార్జీలు ఉండవు. వాటిని మినహాయించినట్టు సజ్జనార్ తెలిపారు. 60 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధవీకరణ కోసం ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’ను అందుబాటులోకి తెచ్చాం’ అని ఎమ్‌డీ సజ్జనార్ వివరించారు. ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ మునిశేఖర్, పురుషోత్తం, కష్ణకాంత్, సీటీఎం జీవన్‌ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్‌ఎం విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు.