నవతెలంగాణ – చండూరు
ధరణిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తహసిల్దార్లు చూడాలి అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె , చండూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి ఫైళ్లను, ధరణి పోర్టల్ ను పరిశీలించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఇప్పటివరకు ధరణి ద్వారా పరిష్కరించిన సమస్యలు, తదితర వివరాలను పరిశీలించారు. ధరణి ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటిని పెండింగ్లో ఉంచకుండా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా ధరణి మాడ్యూల్స్ ఆన్నింటిపై తహసిల్దార్లు పూర్తి అవగాహనతో సమస్యలను పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా తనిఖీ చేసే వాటిని క్షేత్ర స్థాయి సందర్శన తర్వాతే పరిష్కారం చేయాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమైన సమస్యలపై ఆర్డీవో సైతం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చండూర్ ఆర్డీవో శ్రీదేవిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ సమస్యలపై తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.