నరేంద్రునితో సెల్ఫీ దిగండి

Take a selfie with Narendra– కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పాయింట్ల ఏర్పాటు
– సెల్ఫీ క్రేజ్‌ను రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నొం తప్పుపట్టిన మాజీ అధికారులు
యువతలో సెల్ఫీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీనిని ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలని బీజేపీ ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. అక్కడ నిలువెత్తు మోడీ చిత్రపటం మీకు కన్పిస్తుంది. దాని పక్కనే నిలబడి సెల్ఫీ దిగండి.. దేశ ప్రధానితో ఫొటో దిగిన అనుభూతి పొందండని ఊదరగొడుతోంది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభలకు, ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం సెల్ఫీ పాయింట్ల ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద మోడీ చిత్రపటంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చంద్రయాన్‌ వంటి దేశ విజయాలను కూడా ప్రదర్శిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మోడీ ఎన్నికల ప్రచార వాహనంలో కూడా ఈ తరహా ప్రదర్శనలు ఉండే అవకాశం ఉంది.న్యూఢిల్లీలోని సైనిక ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను మాజీ బ్రిగేడియర్‌ హర్దీప్‌ సింగ్‌ సోహీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. సాయుధ దళాలకు రాజ్యాంగమే సుప్రీం అని, రాజకీయ పార్టీలు తమ వైఖరులను మార్చుకోవచ్చు కానీ సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రచారంలో సైనిక దళాలు ఎందుకు భాగస్వాములు కావాలని ఓ మాజీ లెప్టినెంట్‌ జనరల్‌ ప్రశ్నించారు. ఇది సైనిక సంప్రదాయాలను ఉల్లంఘించడమే అవుతుందని రిటైర్డ్‌ కల్నల్‌ ఒకరు చెప్పారు. ఈ చర్య సాయుధ దళాలను రాజకీయ రొచ్చులోకి లాగడమేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఇది ఓ రాజకీయ ఎత్తుగడ అని ఆయన విమర్శించారు. సరిహద్దు రోడ్ల సంస్థ, తీరగస్తీ దళం, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ, సైనిక స్కూల్స్‌, ఎన్‌సీసీ సహా రక్షణ శాఖకు చెందిన అన్ని విభాగాలు, సంస్థలను సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు సెల్ఫీలు దిగి వాటిని అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ఓ యాప్‌ను తీసుకొచ్చే యోచన కూడా చేస్తున్నారు. కాగా కేంద్ర సైన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు కూడా సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ ఇప్పటికే సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. 3డీ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలంటూ రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు పంపింది.
మార్గదర్శకాలు జారీ
సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే తన విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 800కి పైగా పాయింట్లలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ప్రదర్శించడంతో పాటు మోడీ చిత్రాలను కూడా ఉంచుతారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రక్షణ దళాలను రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడాన్ని పలువురు మాజీ సైనికాధికారులు తీవ్రంగా ఖండించారు.