ప్రపంచ అసమానతలపై చర్యలు తీసుకోండి

– ఐరాస, ప్రపంచబ్యాంక్‌కు ఆర్థికవేత్తల వినతి
న్యూఢిల్లీ : ప్రపంచంలోని అసమానతలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివిధ దేశాలకు చెందిన 236 మంది సీనియర్‌ ఆర్థికవేత్తలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌, ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు అజరు బంగాలను కోరారు. ఈ మేరకు వారు ఓ లేఖ రాశారు. నోబెల్‌ బహుమతి గ్రహీత, కొలింబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జోసెఫ్‌ స్టిగ్‌లిజ్‌, మాసాచూసెట్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అమ్‌హస్ట్‌ జయతీ ఘోష్‌ రూపొందించిన ఈ లేఖపై 67 దేశాల ఆర్థికవేత్తలు సంతకాలు చేశారు. ప్రపంచంలోని అసమానతలు సామాజిక, పర్యావరణ లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్యాల సాధనపై ప్రభావం చూపే ఆర్థిక, ద్రవ్య, సామాజిక విధానాలను అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. ‘గత పాతిక సంవత్సరాలలో తొలిసారిగా అటు పేదరికం, ఇటు సంపద…రెండూ పెరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2019-2020 మధ్యకాలంలో అంతర్జాతీయంగా అసమానతలు వేగవంతంగా పెరిగాయి. ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10% మంది ప్రపంచంలోని 52% సంపదను అనుభవిస్తున్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న నిరుపేదలు అందులో 8.5% మాత్రమే సంపాదిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు పెరుగుతున్న ఆహార ధరలు, ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత దశాబ్ద కాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపైంది’ అని ప్రస్తావించారు. అసమానతలు సమాజంలో విచ్ఛిన్నకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఆర్థికవేత్తలు తెలిపారు. అసమానతలను తగ్గించాలని ప్రపంచ దేశాలు 2015లో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కోవిడ్‌ కారణంగా ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు ఆ లేఖలో వివరించారు.