– నన్ను భయపెట్టలేరు : అసోం యాత్రలో రాహుల్
గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ తనను భయపెట్టలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అసోంలోని బార్‌పేటలో ఆయన బుధవారం భారత్ జోడో న్యారు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య మంగళవారం ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్, ఇతర పార్టీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మండిపడుతూ కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. ‘కేసుల ద్వారా నన్ను భయపెట్టవచ్చునని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. మరో పాతిక కేసులు పెట్టుకోండి. నేనేమీ భయపడను’ అని చెప్పారు. అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచివేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుకుంటున్నాయని ఆరోపించారు. అసోంను నాగపూర్ నుండి నడపాలని వారు భావిస్తున్నారని, కానీ తాము అందుకు అనుమతించబోమని చెప్పారు. ప్రజల జేబులు కొల్లగొట్టడంలో బిశ్వ శర్మ అందెవేసిన చేయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను విద్వేషాలను రెచ్చగొడుతున్నానంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ ‘రోజుకు 24 గంటలూ ఆ పని చేస్తోంది ఆయనే. మీరు పత్రికలు, టీవీ చూస్తుంటే వాటి వెనుక ఆయనే ఉంటారు. ఆయన ఏం చెబితే అదే మీడియా మీకు చెబుతుంది. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది బిశ్వ శర్మే. అసోం ముఖ్యమంత్రి రిమోట్ అమిత్ షా చేతిలో ఉంది. ఒకవేళ అమిత్ షాకు వ్యతిరేకంగా ఆయన ఏదైనా మాట్లాడితే రెండు నిమిషాలలోనే పార్టీ నుండి బయటికి గెంటేస్తారు’ అని చెప్పారు. హింస, కవ్వింపు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు పాల్పడిన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ కుమార్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలియజేశారు. కుట్రకు పాల్పడడం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, అల్లర్లకు దిగడం వంటి నేరాలకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు.