– జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
– లోతట్టు కాలనీలు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యపై సమీక్ష
– సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షం, ఈదురుగాలులతో ఇబ్బంది పడుతున్న వారికి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచే జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్.ఏ.ఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవర సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన చేయూతను అందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇండ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలనీ, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.