వరద సహాయచర్యలు చేపట్టండి

– అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజా జీవితానికిఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయచర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క అధికారుల్ని ఆదేశించారు. శనివారంనాడామె వర్షాలు, గోదావరి వరదలపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి గోదావరి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి సమీప గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాగులు ఉప్పొంగే ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలనీ, గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే వర్షాలు, వరద సహాయ చర్యల కోసం కంట్రోల్‌ రూమ్‌, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నందున అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలపాలని ఆదేశించారు. ఏటూరు నాగారంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ టీంలతోపాటు బోట్లు కూడా అందుబాటులో ఉన్నాయనీ, కలెక్టర్లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఏలాంటి ఆపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.