సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి

Take measures to prevent seasonal diseases– ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపండి
– తీవ్రత ఎక్కువున్న జిల్లాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి
– సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్స్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వాటి తీవ్రత ఎక్కువున్న జిల్లాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలను వెంటనే పంపాలని సూచించారు. సంచార వైద్యశాలలు, వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ, అవసరమైన టెస్టులను ఉచితంగా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వెంటనే దోమ తెరలను అందించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన లేఖ రాశారు. ‘ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. డయేరియా, టైపాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, అతిసార వంటి వాటికి గురై ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. ములుగు జిల్లాలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఊర్లకు ఊర్లే జ్వరాలు, వ్యాధులతో మగ్గుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి, జన్నారం, బెల్లంపల్లి, మంచిర్యాల మండలాల్లో మా పార్టీ ప్రతినిధుల బృందాలు బాధిత ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువ మంచాన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు స్ధానిక ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. మెడికల్‌ టెస్టులు చేయించుకోవాలంటే సుదూరంగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం, తదితర ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వర తీవ్రత ఎక్కువై ఆస్పత్రికి చేరేలోపే కొందరు చనిపోతున్నారు. స్ధానిక పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి వల్ల వైద్యం సరిగ్గా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయివేటు ఆస్పత్రుల వైపు వెళ్లాల్సి వస్తున్నది. జ్వర బాధితులు వైద్యం కోసం రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో తమ్మినేని పేర్కొన్నారు.