– తెలంగాణలో గెలవాలి.. కేంద్రంలో మళ్లీ రావాలి..కష్టపడండి
– కుటుంబ కేంద్రీకృతంగా ప్రాంతీయపార్టీలు
– బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు జేపీ నడ్డా దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్రానికి కేటాయించిన నిధుల అంశాలను గ్రామగ్రామాన ప్రచారం చేసి బీజేపీ గెలుపు కోసం శ్రేణులంతా కష్టపడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ గెలిచేలా..కేంద్రంలో మళ్లీ అధికారంలో మోడీ సర్కారు వచ్చేలా శ్రమించాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని వీబీఐటీ కళాశాలలో శుక్రవారం జరిగిన స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతిప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా దేశకీర్తి పెరిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామనీ, తెలంగాణలో రెండు కోట్ల మంది లబ్దిదారులున్నారని చెప్పారు. ఐఎమ్‌ఎఫ్ నివేదికల ప్రకారం తొమ్మిదేండ్ల కాలంలో దేశంలోని 13 కోట్ల మంది పేదరికాన్ని జయించారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన లబ్దిని ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశామని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందే బీజేపీ తీర్మానం చేసిందనీ, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సుష్మాస్వరాజ్ కీలకంగా వ్యవహరించారని వివరించారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్ అంటే (భ్రస్టాచార్ రిశ్వత్ సమితి) అవినీతి, లంచగొండి సమితి అని విమర్శించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీస్ పార్టీలుగా మారాయని చెబుతూ..కాశ్మీర్‌లో ఫరూఖ్ అబ్దుల్లా, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్, ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పార్టీలుగా మారాయనీ, అందులో వారి అభివృద్ధి తప్ప వేరేవారిది ఉండదని చెప్పారు. పదో తరగతి, టీఎస్‌పీఎస్‌సీ పేపర్లను లీకేజీ చేసి యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న బీఆర్‌ఎస్‌ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసిఆర్ నీకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. రజాకార్లను తలపించే పాలన చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపేందుకు బీజేపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
60 రోజులే ఉంది.. కష్టపడండి : జి.కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కావడానికి కేవలం 60 రోజులు మాత్రమే ఉందనీ, శనివారం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఓవైసీ అడుగులకు మడుగులొత్తుతున్న కేసీఆర్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందుకెళ్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్లీ బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బీఎల్ సంతోశ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజరు, అర్వింద్ మీనన్, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, రవీందర్‌రెడ్డి గైర్హాజరు
బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మరోనేత ఏనుగు రవీందర్‌రెడ్డి గైర్హాజర య్యారు. తాను పార్టీ మారబోవటం లేదంటూ రాజగోపాల్‌రెడ్డి గురువారం మీడియా ముఖంగా చెప్పిన విషయం విదితమే. కానీ, మరుసటి రోజే కీలక మైన సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన హాజరుకాకపోవడం పార్టీ మారుతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని రెండు బహిరంగ సభలకూ ఆయన హాజరు కాని విషయం తెలిసిందే. ఆయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.