– రంజిత్, మహేందర్ పార్టీని మోసం చేశారు
– కాళ్లు పట్టుకుని బతిమిలాడినా మళ్లీ చేర్చుకునేది లేదు
– చేవెళ్ల లోక్‌సభపై సమీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘పార్టీకి ద్రోహం చేసి పోయిన గడ్డం రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు పగ తీర్చుకోవాల్సిన అవసరముంది…’ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరికీ తగిన బుద్ధి చెప్పాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కేకే, కడియం లాంటి సీనియర్లు సైతం కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోయే వాళ్లు పార్టీపై కొన్ని రాళ్లు వేసి పోతారనీ, వారు చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ స్థానంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్… పార్టీని వీడిన నేతలపైనా, వారి వ్యవహారశైలిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై విరుచుకుపడ్డారు.
కొంతమంది నాయకులు పార్టీని వదిలేసినా, తాను మాత్రం కార్యకర్తల కోసం పని చేస్తానని తెలిపారు. ‘ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పని చేసిన క్యాడర్ కోసం నేను ఇప్పుడు స్వయంగా వస్తా.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటా…’ అని నేతలకు భరోసానిచ్చారు. 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి, 2019లో గడ్డం రంజిత్‌రెడ్డిని ప్రజలకు పరిచయం చేసింది బీఆర్‌ఎస్సేనని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన రోజు రంజిత్‌రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్నం మహేందర్‌రెడ్డి కూడా పార్టీకి తీరని ద్రోహం చేసి, కాంగ్రెస్ పంచన చేరారని వాపోయారు. అందువల్ల వారిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరించారు. మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేయాలంటూ తాను విసిరిన సవాల్‌కు సీఎం రేవంత్ ఇప్పటికీ స్పందించ లేదని ఎద్దేవా చేశారు. ఈ రకంగా తన సిట్టింగ్ సీట్లోనే వెనుకంజలో ఉన్న ఆయన… అత్యధిక సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతులకు రుణమాఫీ, రూ.4 వేల పింఛను, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, అందరికీ ఉచిత కరెంటు తదితర హామీలేమయ్యాయంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఖమ్మం, నల్లగొండ కాంగ్రెస్ నేతలే రేవంత్‌కు మానవబాంబులవుతారని హెచ్చరించారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు, దాన్ని ఆదుకునేందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారని ప్రశంసించారు. ఆయన కేవలం రంగారెడ్డి జిల్లాకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరిరకీ తెలిసిన నాయకుడని కితాబిచ్చారు. అందువల్ల చేవెళ్లలో ఆయన గెలుపుకోసం ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో నిర్వహించబోయే కేసీఆర్ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… చేవెళ్లలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు తనకు మద్దతుగా నిలుస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.