– టీజీ ఆయిల్ఫెడ్ ఎండీ కి ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు వినతి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రైవేట్ సంస్థలు ఆయిల్ ఫాం సాగు పరిధిలోని లేత గెలలు తో టీజీ ఆయిల్ ఫెడ్ సాగు పరిధిలో ముదురు గెలలు తో కలిపి ముడి ఆయిల్ ఫాం నూనే తయారు చేయడంతో ఓఈఆర్ పడిపోయే అవకాశం ఉన్నందున వేర్వేరుగా ఆడి ఓఈఆర్ పడిపోకుండా చర్యలు చేపట్టాలని ఆయిల్ ఫెడ్ ఎండీ,ఉద్యాన శాఖ కమీషనర్ యస్మీన్ భాషా కు తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు హైద్రాబాద్ లోని ఉద్యాన శాఖ కార్యాలయం లో మంగళవారం వినతి పత్రం అందజేసారు. ఆ వినతి పత్రం లోని సారాంశం యధాతధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కంపెనీలకు అలాట్ చేసిన ఏరియాలలో గత మూడు నాలుగేళ్ళుగా ఏళ్లుగా నాటిన తోటల నుండి గెలలు రావడం మొదలైంది.ఈ ఏరియాల ను అలాట్ చేయించుకొని మొక్కలు నాటించిన ప్రైవేట్ కంపెనీలు నిబంధనలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు నిర్మించకుండా ఆ లేత తోటల గెలల నుండి ఉత్పత్తి అయ్యే తక్కువ ఆయిల్ శాతం కల్గిన గెలలు ను ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట,అప్పారావుపేట ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలకు అలాట్ చేసిన ఏరియాల నుండి వస్తున్న లేత తోటల గెలలు మిల్లు ఆడుట వలన మన ఆయిల్ ఫెడ్ ఓఈఆర్ శాతం తగ్గుతుంది.రైతుకు చెల్లిస్తున్న ధర కూడా తగ్గుతుంది.అంతేగాకుండా ఈ గెలలు మిల్లు ఆడుట వలన మన ఆయిల్ఫెడ్ కు ఒక టన్నుకు సుమారుగా రూ.2000ల వరకు నష్టం వాటిల్లే అవకాశం వుంది. కావున ప్రైవేట్ కంపెనీలు త్వరగా వారికి కేటాయించిన ఏరియాల్లో మిల్లులు నిర్మించుకునే విధంగా రైతుల గెలలు సేకరించే విధంగా ఒత్తిడి తేవాల్సిందిగా కోరుతున్నాం.ఆయిల్ఫెడ్ పరిధిలోని తెలంగాణ రైతాంగం నష్టపోకూడదు,ఆదుకోవాలి అని ప్రభుత్వం భావించినట్లయితే ఈ ఒక్క సీజన్ కు ప్రైవేట్ కంపెనీ వారు తెచ్చే గెలలు ను అనుమతించి వాటి నుండి వచ్చే ఆయిల్ శాతం ఆధారంగానే తగ్గించి చెల్లింపులు చేయాలి. కానీ రైతులకు మాత్రం మన తెలంగాణ ఆయిల్ఫైడ్ ధర ప్రకారమే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి అని కోరారు.