కుక్కల దాడుల నివారణకు చర్యలు తీసుకోండి

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలపై ముఖ్యంగా పిల్లలపై కుక్కలు దాడులు చేసి, కరుస్తున్నాయనీ, ఆయా ఘటనల్లో పిల్లలు చనిపోతున్నారని హైకోర్టు పేర్కొంది. అందువల్ల వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కుక్కల దాడుల నివారణకు తీసుకునే చర్యలకు సంబంధించి తగిన మార్గదర్శకాలతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ విషయంలో కోర్టులు చెప్పేదాని కంటే నిపుణుల కమిటీ ఇచ్చే సలహాలే కీలకమని అభిప్రాయపడింది. వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య ఇతరు లు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే బెంచ్‌ గురువారం విచారిం చింది. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆరు కమిటీలు వేసిందనీ, జంతు సంరక్షణ కమిటీలతో కలిసి కుక్కల దాడుల నివారణకు చర్యలను నివేదించాలని ఆదేశించింది. రాష్ట్రంలో 3.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. నిపుణులతో చర్చించి తగిన పరిష్కార ప్రతిపాదనలతో ఈ నెల 31న విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది.