ప్రజ్వల్‌ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోండి

ప్రజ్వల్‌ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోండి– ఐద్వా డిమాండ్‌
– రెేవణ్ణ దురాగతాల గురించి బీజేపీకి ముందే తెలుసని విమర్శ
న్యూఢిల్లీ : కర్నాటకలోని హస్సన్‌ నియోజకవర్గ లోక్‌సభ ఎంపీ, ప్రస్తుత ఎన్నికల్లో జేడీ(ఎస్‌) అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ చేసిన దుశ్చర్యలపై ఐద్వా ఆగ్రహం, అసహ్యం వ్యక్తం చేసింది. రెవన్న మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవగౌడ మనవడు కాగా, జేడీ(ఎస్‌) బీజేపీ మిత్రపక్షం. తీవ్రమై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణపై కర్నాటక ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. విచారణ కోసం సిట్‌ ఏర్పాటు చేసింది. గతంలోనే రేవణ్ణ దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. అయితే హైకోర్టు అతనికి ఊరట కలిగించింది. రేవణ్ణ పెన్‌ డ్రైవ్‌లో అనేక అభ్యంతకర వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తన లైంగిక డిమాండ్లు తీర్చుకోవడానిక ఈ వీడియోలను, ఫోటోలను రేవణ్ణ ఉపయోగించుకునేవాడు. రెవన్న, అతని తండ్రి హెచ్‌డి రెవన్నపై అనేక మంది బాధితుల్లో ఒకరైన ఒక మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం వారు పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడే వారు. ఈ మహిళ మరో ఐదుగురు మహిళలతో కలిసి వారి ఇంట్లో పనిమనిషిగా పనిచేసేవారు. ఆమె ఫిర్యాదు ప్రకారం వారంతా లైంగిక వేధింపుల బాధితులే. కర్నాటక ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిసి ఈ నెల 28న ఉదయం ప్రజ్వల రెవన్న దేశం విడిచి జర్మనీ పారిపోయాడు.
కాగా, మరొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే రెవన్న చేసే దుశ్చర్యల గురించి బీజేపీ పెద్దలకు ముందే తెలుసు. రేవణ్ణ పెన్‌డ్రైవ్‌లో 3 వేలకు పైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, జేడీ(ఎస్‌)తో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సీనియర్‌ నాయుకులు దేవరాజ గౌడ డిసెంబరు 23నే లేఖరాసారు. అయినా బిజెపి నాయకులు పెదవి విప్పలేదు. ఇది రేవణ్ణ దుశ్యర్యలకు మద్దతు ఇచ్చేదిగా ఉందని ఐద్వా విమర్శించింది. అలాగే ఇది బీజేపీలోనే లైంగిక నేరస్థులకు పార్టీ ఇచ్చే మద్దతుకు అనుగుణంగా ఉందని ఆరోపించింది. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఐద్వా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాన మీడియా కూడా రేవణ్ణ దురాగతాల విషయంలో మౌనంగా ఉంటుందని ఐద్వా తెలిపింది.రెవన్నను వెంటనే స్వదేశానికి తీసుకునిరావాలని, అతనికి, అతని తండ్రికి సాధ్యమైనంత తక్కువ సమయంలో అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. లైంగిక నేరస్థులకు ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇవ్వ వద్దని ఐద్వా ఈ సందర్భంగా కోరింది.
జేడీ(ఎస్‌) నుంచి సస్పెండ్‌ చేస్తాం : కుమారస్వామి
అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీ(ఎస్‌)ను సస్పెండ్‌ చేస్తామని ఆ పార్టీ నాయకులు నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం తెలిపారు. ‘ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రేపు హుబ్బళ్లిలో జరిగే కోర్‌ కమిటీ సమావేశంలో సిఫారసు చేయాల్సి ఉంది. అయితే ప్రజ్వల్‌ ఎంపి కాబట్టి ఇది ఢిల్లీ నుంచి జరగాలి. కాబట్టి ఈ విషయంపై జేడీ(ఎస్‌) జాతీయ అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి దేవగౌడకు విజ్ఞప్తి చేశాను’ అని చెప్పారు. అయితే ప్రజ్వల్‌ అఘాత్యాల విషయం తనకు కాని, దేవగౌడకు కాని తెలియదని చెప్పారు. ప్రజ్వల్‌ ఆచూకీ విషయం తనకు తెలియదని అన్నారు.