
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో వచ్చే వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి సమస్య ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్.పి. సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు తో కలసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడకూడా నీటి ఎద్దడి రాకుండా సంబంధిత అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులకు సంబందించిన ప్రతిపాదనలు ఆమోదం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నుండి సి.సి. రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టాలని సూచించారు. రంగారెడ్డి రెడ్డి జిల్లా చేవెళ్ల లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదిగా ప్రారంభించే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించ నున్నందున జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల లో 200 మంది చొప్పున మొత్తం 800 మందిని 16 ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లాలని ఆదిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.అలాగే మద్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కల్పించాలని సబందిత అధికారులను ఆదేశించారు.
ఒక్కో బస్సుకు ఒక పోలీస్ అధికారి, లైజనింగ్ అధికారి, ఒక ఆశ వర్కర్ లను నియమించడం జరిగిందని, నియమించిన అధికారులు బస్సులను పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. ధరణిలో అనేక మార్పులు రాబోతున్నాయని, దరఖాస్తులను ఆర్డీవో, తహశీల్దార్లు లెవెల్ లోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున ఆర్డీవో, తహశీల్దార్లు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. మరో మూడు వారాల పాటు ధరణి పై స్పెషల్ గ్రీవిన్స్ ఏర్పాటు చేసి ధరణి సమస్యలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అధికారులు సెలవులో ఉంటున్నారని ఖచ్చితంగా అధికారులు ప్రజావాణిలో హాజరు కావాలని అలాగే డిఆర్డీఏ లో ప్రజావాణిలో హాజరు కానీ ముగ్గురు ఏపీఎం లకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డిఆర్డీఏ పిడి మధుసూదన్ రాజు ను కలెక్టర్ ఆదేశించారు. మార్చి 31వరకు కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉందని, కొత్త ఓటరు నమోదు పై అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజావాణి దరఖాస్తు లను అధికారులు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని ఇప్పటి వరకు ప్రజాదర్బార్ లో 321 దరఖాస్తు లు వచ్చాయని వాటిలో 232 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మరో 89 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ప్రజావాణిలో ఎక్కువగా వివిధ భూసమస్యలకు సబందించి 28, ఇతర శాఖలకు సంబంధించి 20 మొత్తం 48 దరఖాస్తులు అందాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
మత్స్యకార సొసైటీల బలోపేతానికి కృషి: జిల్లాలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మత్స్య కారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ రుణాలు మంజూరుకు సంఘ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులను సమన్వయం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను మత్స్య శాఖకు బదలాయింపు చేయడం వలన అన్ని జి.పి.లకు ఎక్కడకూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని జి.పి.లకు ఉత్తర్వులు జారీ చేయాలనీ సూచించారు. జి.పి లలో ఎండిపోయిన చెరువుల రకం (లీజు) నిబంధనల మేరకు మాఫీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని నియోజక వర్గాల్లో మత్స్య కారుల సొసైటీల బలోపేతానికి అలాగే సమస్యల పరిష్కారానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడకూడా చెరువులు కబ్జాలు కాకుండా ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, పంచాయతీ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘాల చీఫ్ ప్రమోటర్ బి. శ్రీనివాస్, వివిధ మండలాల సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.