
నవతెలంగాణ – కామారెడ్డి
మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మానసిక అవగాహన కార్యక్రమంలో న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ జి రమణ ముఖ్య అతిథి హాజీరై విద్యార్థులకు అవగాహన కలిగించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మాచారెడ్డిలో మానసిక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఆదర్శ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ జి.రమణ పాల్గొని విద్యార్థులకు అవగాహన కలిగించారన్నారు. విద్యార్థి దశలో ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని, మన భవిష్యత్తుకు మనమే బాధ్యతా తీసుకోవాలని,ఈ క్రమంలోనే వచ్చే అవరోధాలను అధిగమించాలని, అందుకు తగినవిధంగా మానసిక దృఢత్వం కలిగి ఉండాలని అన్నారు.
క్రమపద్ధతిలో అధ్యాపకులు చెప్పిన విధంగా చదవాలని, ఈ దశలో విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, మొబైల్ ఫోన్ వినియోగం సమాచారం కోసం మాత్రమే వినియోగించాలని,వినోదం కోసం ఏ మాత్రం ఉపయోగించరాదని సూచించారు. పరీక్షల కాలంలో విద్యార్థులకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయని వణకడం, బయపడిపోవడం,వాంతులు రావడం లాంటివి జరుగుతాయని అందుకు మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమమని తెలిపారు. కొంతమంది ఏం చేయలేని స్థితిలో ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు దరి చేరి క్షణికావేశల కు లోనవుతారని, వాటిని అధిగమించడానికి రోజూ చదవడానికి సమయం కేటాయించాలని, సందేహాలుంటే అధ్యాపకుల ద్వారా నివృత్తి చేసుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారని విద్యార్థులకు సూచించారు. అంతే కాకుండా ప్రేమ విషయాలు ఈ వయసులో వచ్చే ఆకర్షణలు మాత్రమేనని క్షణికావేశలకు పోకూడదని అన్నారు. అనంతరం సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా రాహుల్ మాట్లాడుతూ మానసిక సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలి మానస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416, నిత్యం అందుబాటులో వుంటుందని ఏ విధమైన మానసిక సమస్యలకైన కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు. ప్రిన్సిపల్ యాకునుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక దృఢత్వం విషయంలో అవగాహన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తిరుపతి రెడ్డి, నర్సింలు,రామకృష్ణ,నజీమా వైద్య సిబ్బంది డా.రాహుల్, వై.వి.రావు , అధ్యాపక, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.