తొలిపోస్టింగ్‌ లోనే లంచం తీసుకుంటూ..

దొరికిపోయిన మహిళా అధికారి
రారుపూర్‌ : జార్ఖండ్‌ లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల క్రితం మిథాలి శర్మ, కోడర్మ జిల్లాలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. అదే ఆమెకు తొలి పోస్టింగ్‌. కానీ, డబ్బులపై కక్కర్తితో ఆమె అవినీతి నిరోధక శాఖ అధికారులకు జులై 7న అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా వారు ఆమెను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం, మిథాలీ శర్మ తొలుత కోడర్మా జిల్లాలోని వ్యాపార్‌ సహ్యౌగ్‌ సమితిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడి లావాదేవీలు పరిశీలించగా లెక్కల్లో రూ.20 వేల మేరకు తేడా కనిపించింది. దీంతో, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేశారు. అయితే, మిథాలీ డిమాండ్‌పై ఆ సంస్థ సిబ్బంది ఒకరు అవినీతి నిరోధక శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌తో ఆమెను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.