చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు

Taking the law into one's own hands will not be tolerated– కేయూ ఆందోళనలపై.. వరంగల్‌ సీపీ ఏవీ.రంగనాథ్‌
నవతెలంగాణ-సుబేదారి
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. గురువారం హన్మకొండ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి సీపీ మాట్లాడారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించినప్పటికీ విద్యార్థులు పట్టించుకోలేదని అన్నారు. కేయూ వీసీ కండ్లలో ఆనందం చూసేందుకు తాను గన్‌పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారని తెలిపారు. తానే దగ్గరుండి కొట్టానని చెబుతున్నారని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్‌ డోర్‌ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఈ విద్యార్థులే ఫిబ్రవరి 28న బైరి నరేష్‌పై దాడి చేసినట్టు తెలిపారు.
వైద్య పరీక్షల బోగస్‌ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. పాత గాయాలు చూపించి తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్‌ ముందు కూడా చెప్పారన్నారు. ఇలాంటి ఆరోపణలు తమకు కొత్తకాదని, కేయూలో చాలా సంఘాలు ఉన్నా కొందరే ఇలా చేశారని, కేయూలో తప్పులు జరిగితే చట్టం, కోర్టులు పోరాడవచ్చు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్‌ మాట్లాడుతూ.. కేయూ పీహెచ్‌డీ కేటగిరి-2 అడ్మిషన్‌లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రక్రియంతా పారదర్శకంగానే కొనసాగించామని తెలిపారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారని, నిబంధనలకు అనుగుణంగా ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామని, మాకు కులం, మతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మొన్న డోర్లు తన్నుకుంటూ.. అసభ్యపదజాలంతో దూషిస్తూ తన ఛాంబర్‌కు వచ్చి కొందరు విద్యార్థులు గలాటా చేశారన్నారు. అక్రమ మార్గంలో పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందేందుకే ఇలా చేస్తున్నారని వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.