ప్రతిభ ఉంటే చాలు..

రెండు ఆస్కార్‌లను సొంతం చేసుకుని మన చిత్రాలు యావత్‌ భారతీయ ప్రజానీకాన్ని గర్వపడేలా చేశాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు..నాటు..’ పాటకు ఆస్కార్‌ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇది తమకి వచ్చిన అవార్డేనని సంబురాలు చేసుకున్నారు. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ని కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఆస్కార్‌ నామినేషన్లలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన దర్శక, నిర్మాతలెవరో కూడా చాలా మందికి తెలీయదు. కానీ, ఆస్కార్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్లై చేసిన దగ్గర్నుంచి రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎవరనేది యావత్‌ ప్రపంచానికి తెలిసింది. పలు ఆస్కార్‌ అవార్డులను టార్గెట్‌గా చేసి రంగంలోకి దిగినప్పటికీ నామినేషన్లలో కేవలం ‘నాటు..నాటు’ పాటకే చోటు దక్కడంతో ఒకింత నిరాశకి గురైనా, ప్రమోషన్ల పర్వాన్ని మరింత ఉధృతం చేసింది. దీంతో ‘నాటు నాటు..’ పాట హాలీవుడ్‌ థియేటర్లలో ప్రేక్షకుల్ని సైతం స్టెప్పులు వేయించింది. ఆఖరికి ఆస్కార్‌ వేదికని సైతం ఓ ఊపు ఊపేసింది. ఈ ప్రచార పర్వం కారణంగా ఓవర్సీస్‌ల్లో కూడా సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, నృత్య దర్శకుడు ప్రేమ్‌ రక్షిత్‌ గురించి అందరికీ తెలిసింది. మొత్తమ్మీద భారీ ప్రమోషన్ల హంగామా చేసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు పాట ఆస్కార్‌ని కైవసం చేసుకుంటే, ఎలాంటి చడీ చప్పుడు లేకుండా షార్ట్‌ ఫిల్మ్‌లోని కంటెంట్‌తో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ని దక్కించుకుంది. అంతేకాదు ప్రతిభ ఉంటే చాలు.. మన గురించి మరీ డప్పు కొట్టుకోనక్కర్లేదని, ప్రమోషన్ల కోసం డబ్బులు వెదజల్లక్కర్లేదని కూడా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అని అనౌన్స్‌ చేసిన తర్వాత ఇద్దరు మహిళలు వేదికపైకి వచ్చి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాలను అందుకున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు దర్శకురాలు కాగా, మరొకరు నిర్మాత. అవార్డు అందుకున్న తర్వాత వీళ్ళు ఎవరని గూగూల్‌లో సెర్చ్‌ చేసిన వాళ్ళ లెక్క సెకను సెకన్‌కి పెరిగిపోయింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌ దర్శకత్వంలో నిర్మాత గునీత్‌ మోగ నిర్మించారు. దర్శకురాలికి ఇదే తొలి షార్ట్‌ ఫిల్మ్‌ కాగా గునీత్‌ మోగ ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించారు. ఇంతకీ వీళ్ళు ఈ షార్ట్‌ ఫిల్మ్‌కి ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఏంటో తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోయారు. రెండు అనాథ ఏనుగు పిల్లలను ఆదరించిన ఓ పేద నిరుపేద జంట కథ ఇది. ప్రకృతికి, మనిషికి, జంతువుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందనే కంటెంట్‌తో షార్ట్‌ ఫిల్మ్‌ తీసి, భారీ పోటీని సైతం తట్టుకుని ప్రతిష్టాత్మక ఆస్కార్‌ని దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. అలాంటిది ఈ మహిళా దర్శక, నిర్మాతలు సాధ్యమే అని ఆస్కార్‌ వేదిక సాక్షిగా నిరూపించారు. అంతే కాదు ఎప్పటికైనా, ఎక్కడైనా సరే కంటెంటే కింగ్‌ అని సాలీడ్‌గానూ చెప్పారు. ఆస్కార్‌ను అందుకున్న తర్వాత ఈ షార్ట్‌ ఫిల్మ్‌లోని ఆనాథ ఏనుగు పిల్లలను చూసేందుకు దేశ, విదేశాలను నుంచి టూరిస్టులు తమిళనాడులోని కృష్ణగిరి ఆరణ్యానికి తరలి రావడం విశేషం.
ఎందుకు మౌనంగా ఉన్నాయి?
ఆస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డుని తెలుగు సినిమా పాట కైవసం చేసుకున్నప్పటికీ మన దేశంలోని ఇతర సినీ పరిశ్రమలు ఎందుకు మౌనంగా ఉన్నాయి?, ముఖ్యంగా బాలీవుడ్‌ ఎందుకు గప్‌చుప్‌గా ఉంది. సోషల్‌ మీడియా వేదికగా ఎందుకు అభినందనలు తెలుపలేదు?, ఎవరో ఒకరిద్దరు ప్రముఖులు తప్ప వీటి గురించి సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు ఎందుకు చేయలేదు. వాళ్ళు జెలసీగా ఫీలయ్యారా లేక పెద్ద లాబియింగ్‌ వల్లే వచ్చిందనే భావనతో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇతర సినీ పరిశ్రమలే కాదు మన తెలుగునాట కూడా గాయనీగాయకులు, సంగీత దర్శకులు, గీత రచయితలు ఊహించిన స్థాయిలో అభినందనలు చెప్పకపోవడాన్ని ఎలా స్వీకరించాలి? అనేది కూడా సమాధానం లేని ప్రశ్నగానే మిగలడం బాధాకరం.