– జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు స్వీకరణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈనెల 22 న మండల స్థాయిలో “నా ఓటు విధిగా వినియోగించు కుంటాను” అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన,డ్రాయింగ్, ఉపన్యాస పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 23 న కొత్తగూడెం కలెక్టరేట్ లో జరిగిన పోటీల్లో జవహర్ విద్యాలయం కు చెందిన ఎల్. ఏశ్విత సాయి రోషిణి శ్రీ డ్రాయింగ్ లో మొదటిస్థానం,వ్యాస రచనలో మూడవ స్థానం సాధించగా,నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన డింపుల్ అనే విద్యార్థి ఉపన్యాస పోటీల్లో రెండోస్థానంలో నిలిచారు. విజేతలకు శనివారం కొత్తగూడెం క్లబ్ లో జరిగిన ఓటర్ల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బహుమతులు అందించారు. మండల స్థాయిలో జరిగిన పోటీల్లో ఏశ్విత సాయి రోషిణి శ్రీ జూనియర్ విభాగంలో డ్రాయింగ్,వ్యాసరచన పోటీల్లో మొదటిస్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు.బహుమతులు అందుకున్న చిన్నారులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.