‘తాంబేలు ఇగురం’ బాలల కథల సంపుటి పేరు చూసి, ఇందులోని కథలు తెలంగాణ మాండలికంలో ఉన్నాయని అనుకుంటాం. తెలంగాణ ప్రాంతానికి చెంది, యాస పట్ల మంచి పట్టున్న రచయిత పైడిమర్రి రామకష్ణ. కానీ తెలుగు బాలలు అందరికీ తన కథలు చేరాలన్న లక్ష్యంతో కేవలం ‘తాంబేలు ఇగురం’ కథ మాత్రమే తెలంగాణ సరళ మాండలికంలో రాశారు. మిగితా కథలన్నీ మాములు పుస్తక భాషలో ఉంటాయి. ఇతర ప్రాంత బాలలకు తెలంగాణ మాండలిక పదాలు పరిచయం చేయాలన్న ఆకాంక్షతో ఒక్క కథనే మాండలికంలో రాశారు. గ్రంథాలకు టైటిల్ ఆకర్షణీయంగా, వినూత్నంగా పెడుతుంటారు పైడిమర్రి రామకష్ణ.
తెలంగాణా ప్రాంతంలో తాబేలును ‘తాంబేలు’ అని, ‘ఇగురం’ అంటే తెలివి, ఉపాయం అనే అర్ధాలు ఉన్నాయని రచయిత ముందుమాటలో వివరిస్తారు. తాంబేలు ఇగురంలో మొత్తం 30 కథలున్నాయి. అన్ని కథల్లోనూ జంతువులు, పక్షలే ప్రధాన పాత్రలుగా ఉంటాయి. ఈ సంపుటిలో మొదటి కథ ‘ఎత్తుకెదిగిన కోతి’, చివరి కథ ‘తాబేలు దృఢ నిశ్చయం’. ఇక రెండవ కథ ‘తాంబేలు ఇగురం’. ఓటమి అనేది లేనిది అసలు పోటీలో పాల్గొనని వారికేనని, పోటీలో ఓడిపోయిన వారిని అవమానపరిచే కప్పను తన తెలివితో పోటీకి ఒప్పించి కప్పను ఓడించిన తాబేలు కథే ‘తాంబేలు ఇగురం’. ఈ సంపుటి 5,6 కథలు తాబేలు ముఖ్య పాత్రలుగా ఉండటం మరో విశేషం. ప్రతి కథలోనూ ఏదో ఒక నీతో, సందేశమో అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని నవ్వు తెప్పించే సరదా కథలు కూడా ఇందులో ఉన్నాయి. వేడుక, రుచి విలువ, ఎలుగుబంటి మొహమాటం, మతిమరపు తాబేలు కథలు ఈకోవకు చెందినవే.
చిత్రకారుడు తుంబలి శివాజీ పంచరంగుల ముఖచిత్రం ఈ కథలసంపుటికి ఆకర్షణగా నిలిస్తుంది. లోపల ప్రతి కథకూ అందమైన బొమ్మలు ఉంటాయి. బాలలు సొంతగా చదువుకునే శైలిలో ఉండే ఈకథలన్నీ గతంలో బాలల పత్రికలలో ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందినవే!
– మహంకాళి స్వాతి, 89197 73272
బాలలను నవ్వించే ‘తాంబేలు ఇగురం’ కథలు
12:36 am