ముందే మాట్లాడుకోండి..

Talk in advance..పెండ్లి చేసుకోబోయే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడమేకాదు, అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం అవసరం. అన్ని అంశాల్లోనూ సాధ్యం కాకపోతే, కొన్ని ప్రధానమైన విషయాల్లోనైనా ఇద్దరూ ఒకేమాట మీద ఉండాలి. అప్పుడే పెండ్లి తర్వాత అభిప్రాయభేదాలు రాకుండా సంతోషంగా ఉంటారు. అయితే ఈ మధ్య విడిపోతున్న జంటల్ని గమనిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాబోయే జీవిత భాగస్వామితో కొన్ని ఆర్థికపరమైన విషయాలు ముందే చర్చిస్తే మంచిది. ఆ ఆర్థికపరమైన అంశాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.
ముందుగా మీకు కాబోయే జీవిత భాగస్వామితో మీ ఆర్థిక విషయాల గురించి నిజాయితీగా మాట్లాడండి. మీ ఆదాయం, పొదుపు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు, ఖర్చుల గురించి చర్చించండి. ఇలా చేయడం వల్ల కాబోయే దంపతుల ఆర్థిక నేపథ్యం తెలుస్తుంది. అలాగే పరస్పర ఆర్థిక ప్రాధాన్యతలను తెలియజేయడానికి వీలవుతుంది. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.
ఆర్థిక లక్ష్యాలు
కాబోయే దంపతులు స్వల్ప లేదా దీర్ఘకాలిక లక్ష్యాలపై చర్చించుకోవాలి. ఇల్లు కొనడం, పెట్టుబడులు పెట్టడం లాంటివే కాకుండా, కుటుంబ ప్రణాళికల గురించి కూడా చర్చించుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం, చదువుల కోసం డబ్బు పొదుపు గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగత, ఉమ్మడి లక్ష్యాల గురించి చర్చించుకోవడం కూడా మంచిది.
పెండ్లి, హనీమూన్‌ ఖర్చులు
పెండ్లి ఖర్చులు, హనీమూన్‌ కోసం కొంత బడ్జెట్‌ను పక్కకు తీయాలి. పెండ్లికి పెట్టబోయే ఖర్చుపై కాబోయే దంపతులిద్దరూ ముందుగా చర్చించుకోవాలి. తదనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్‌ చేయండి. అయితే వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో పెండ్లి చేసుకోవడం మంచిది. ఈ ఖర్చుల కోసం అప్పులు చేయకుండా ఉండడం మరీ మంచిది.
ఖర్చులలోనూ భాగస్వామ్యం
కాబోయే దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఇంటి అద్దె, కిరాణా సామాగ్రి, ఇతర ఖర్చులను ఇద్దరు షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఖర్చులను సమానంగా విభజించుకుంటారు. మరికొందరు వ్యక్తిగత ఆదాయం ఆధారంగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయాలపై కాబోయే జంట ముందే మాట్లాడుకుంటే వారి భవిష్యత్‌కు మంచిది.
అత్యవసర నిధి
వైద్యం, ఉద్యోగం పోయినప్పుడు ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. దీని కోసం మూడు నుండి ఆరు నెలలకు సరిపడా డబ్బులను ఆదా చేయడం మంచిది. ఇలా భాగస్వామ్య అత్యవసర నిధిని ప్రారంభించడం వల్ల మీరు కష్ట సమయాల్లో లోన్‌లు, అప్పులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి విషయాలపై కూడా కాబోయే జంట చర్చించుకోవాలి.
ఆడంబరాలు వద్దు
మీ దగ్గర డబ్బులు లేనప్పుడు పెండ్లి విషయంలో ఆడంబరాలను పోవద్దు. వీలైనంత వరకు తక్కువ ఖర్చుతోనే మ్యారేజ్‌ చేసుకోండి. ఒకవేళ అప్పు తీసుకుని పెండ్లి చేసుకునేటప్పుడు అది మీ స్తోమతకు మించిపోకుండా చూసుకోండి. ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎడ్యుకేషన్‌ లోన్స్‌, క్రెడిట్‌ కార్డు, పర్సనల్‌ లోన్స్‌ వంటి అప్పులను తీర్చేయండి. ముందుగా అధిక వడ్డీ రేటు ఉన్న అప్పులను కట్టేయండి. దీని వల్ల మీకు కొంత భారం తగ్గుతుంది.
ఆరోగ్య బీమా పాలసీ
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పాలసీ చాలా అవసరం. అత్యవసర సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ గురించి కూడా కాబోయే దంపతులు చర్చించుకోవాలి.
ఉమ్మడిగా పెట్టుబడులు
దంపతులిద్దరూ కలిసి పెట్టుబడులు పెట్టడం వల్ల బలమైన ఆర్థిక భవిష్యత్తు ఉంటుంది. పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్స్‌లలో పెట్టుబడులు పెట్టడంపై కలిసి చర్చించుకోండి. జాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఖాతాను ఓపెన్‌ చేయండి. అలాగే ఏవైనా ఆస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు.
పొదుపుపై చర్చలు
ఖర్చు, పొదుపుపై ఎక్కువగా చర్చించుకోండి. మీ దీర్ఘకాల, వ్యక్తిగత లక్ష్యాల కోసం నెలవారీగా ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో చర్చించుకోండి. దీని ప్రకారం మీ భవిష్యత్తును ప్రారంభించుకోండి.
వీలునామా
ఎస్టేట్‌ ప్లానింగ్‌ అనేది కూడా ముఖ్యమే. కానీ దీన్ని చాలా మంది పట్టించుకోరు. పెండ్లయిన తర్వాత వీలునామాను రాయడం వల్ల ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే మీ ఆస్తులు మీరు అనుకున్నవారికి సురక్షితంగా దక్కుతాయి. ఈ విషయంపై కూడా ముందే చర్చించుకోవడం మంచిది.