కరువుపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు

– బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలపై కోదండరెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కరువు పరిస్థితులపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నేత కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు అధికారంలో ఉండి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో అనేక సార్లు తీవ్రమైన కరువు వచ్చిందన్నారు. దాన్ని అధిగమించేందుకు ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి కేంద్రానికి నివేదిక పంపించారని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరువును అధిగమించేలా రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తాగు, సాగు నీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. కష్టకాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ మీడియా కమిటీ చైర్మెన్‌ సామ రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదలు తీవ్ర ఇబ్బందులపాలయ్యాయరని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.