మెదక్‌ ఘర్షణలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి : తమ్మినేని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మెదక్‌ ఘర్షణల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. మెదక్‌ పట్టణంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు బీజేవైఎమ్‌, భజరంగ్‌దళ్‌ నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారనీ, పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించిన మీడియా సమావేశంలో వీరి ప్రమేయమున్నట్టుగా పేర్కొనడం గమనార్హమని పేర్కొన్నారు. ప్రజల మద్య భావోద్వేగాలు రెచ్చగొట్టి, వైషమ్యాలు సృష్టించి తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఏమాత్రం తగదని హెచ్చరించారు. సమస్యను సృష్టించిన బీజేపీ నాయకులే జిల్లా బంద్‌కు పిలుపునివ్వటం వారి ఎత్తుగడలను స్పష్టం చేస్తున్నదని తెలిపారు. ఘర్షణకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలనీ, ప్రజలు సామరస్యం, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.