– వెంటిలేటర్‌ను తొలగించిన ఏఐజీ వైద్యులు సాధారణ స్థితికి బీపీ, పల్స్ స్థాయి
– మంత్రులు భట్టి, పొంగులేటి, సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి విఎస్‌ఆర్ సహా పలువురి పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతున్నది. గురువారం ఆయనకు వెంటిలేటర్‌ను ఏఐజీ వైద్యులు తొలగించారు. దీంతో ఆయన సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారు. డాక్టర్లు, పార్టీ నాయకులతో మెల్లగా మాట్లాడుతున్నారు. బీపీ, పల్స్ సాధారణ స్థితికి చేరకుంటున్నాయి. కిడ్నీ పనితీరు మెరుగుపడుతున్నదనీ, గుండె కొట్టుకోవడంలో మార్పు వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదనీ, హైదరాబాద్‌కు సందర్శకులు ఎక్కువ మంది రావొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మినేనిని మంగళవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఏఐజీ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి తమ్మినేనిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మినేని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని చెప్పారు. తమ్మినేనిని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కోకన్వీనర్ అజ్మతుల్లా, ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజరుబాబు, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, చుక్క రాములు నాయకులు బండి రమేష్‌తోపాటు పలువురు రాష్ట్ర నేతలున్నారు.