‘తండేల్‌’.. ఒక స్వచ్ఛమైన ప్రేమకథ

'Tandel'.. is a pure love story‘మత్సలేశ్యం అనే ఊరుని బేస్‌ చేసుకుని తీసుకున్న కథతో ‘తండేల్‌’ చేశాం. ఇక్కడి వారు గుజరాత్‌ పోర్ట్‌కి ఫిషింగ్‌కి వెళ్తారు. అక్కడ బొట్లు ఉన్న వారికి బిరుదులు ఉంటాయి. మెయిన్‌ లీడర్‌ని ‘తండేల్‌’ అంటారు. ఇది గుజరాతీ పదం’ అని నిర్మాత బన్నీవాసు అన్నారు.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’.
చందూ మొండేటి దర్శకుడిగా, అల్లు అరవింద్‌ సమర్పణలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీవాసు సోమవారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
నా క్లాస్‌ మేట్‌ భాను. తను కో ప్రొడ్యూసర్‌ కూడా. రైటర్‌ కార్తిక్‌ దగ్గర ఈ కథ విని, బావుందని నా దగ్గరికి తీసుకొచ్చాడు. కార్తిక్‌ చెప్పిన కథలో ఎసెన్స్‌ నాకు చాలా నచ్చింది. తనది కూడా మత్సలేశ్యం ఊరు పక్కనే. అక్కడ స్ఫూర్తి పొంది కథ రాసుకున్నాడు. పాయింట్‌ నాకు చాలా నచ్చింది. ‘కార్తికేయ 2’ తర్వాత చందుని ఈ కథ వినమన్నాను. తనకీ చాలా నచ్చింది. ఈ కథ కోసం చాలా రీసెర్చ్‌ చేశాం. ఇందులో భాగంగా కొందరిని కలిసినప్పుడు వారు చెప్పిన విషయాలు గూస్‌ బంప్స్‌ తీసుకొచ్చాయి. ఈ విషయాలన్నీ చెప్పడానికి రాజు, సత్య అనే ఫిక్షనల్‌ క్యారెక్టర్స్‌ని డైరెక్టర్‌ చందు డిజైన్‌ చేశారు. ఈ క్యారెక్టర్స్‌ ద్వారా జరిగిన కథ చెప్పాం.
ఇది ప్యూర్‌ లవ్‌ స్టోరీ. రాజు, సత్య ప్రేమ కథ చాలా కీలకం. ఆ లవ్‌ స్టోరీ ద్వారా ఒరిజినల్‌గా జరిగిన స్టోరీని చూపించుకుంటూ వచ్చాం. ఇది యాభై శాతం ఫిక్షన్‌. యాభై శాతం నాన్‌ ఫిక్షన్‌.
నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్‌ ఇవ్వడానికి చైతూ దగ్గరికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. ఆయనకి పాయింట్‌ చాలా నచ్చింది. భలే ఉంది, మనం చేస్తున్నామని అన్నారు. అయితే ఇందులో ఫిషర్‌ మ్యాన్‌ క్యారెక్టర్‌, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం ఉండదు, అంతా ఒరిజినల్‌లా షూట్‌ చేయాలని అనుకుంటున్నాం. యాస కూడా ఉంటుందని చెప్పాను. ‘నేను వర్క్‌ చేస్తా’నని చెప్పారు. ఆయన ఈ పాత్ర కోసం మౌల్డ్‌ అయిన విధానం అద్భుతం. ఆడియన్స్‌ అందరికీ ఈనెల 7న చైతు సర్‌ప్రైజ్‌ ఇస్తారు. చివరి అరగంట అయితే కుమ్మేశారు.
సాయి పల్లవి రష్‌ చూసి ‘నేను మామూలుగా చేసుకుంటూ వెళ్లాను. చైతు నాకు గట్టి కాంపిటేషన్‌ ఇచ్చారు’అని చెప్పి తనకి మ్యాచ్‌ అయ్యేలా నటించారు. శివుని పాటలో సాయి పల్లవి, చైతు డ్యాన్స్‌ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది.
ఇది రూటెడ్‌ స్టొరీ. నేచురల్‌గా షూట్‌ చేశాం. అంత నేచురల్‌గా మ్యూజిక్‌ కూడా ఉంటుంది. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌ అద్బుతం. ఇప్పటికే పాటలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. ఈ సినిమా మూడు భాషల్లో రిలీజ్‌ అవుతుంది. మెయిన్‌ తెలుగు. హిందీ, తమిళ్‌ డబ్బింగ్‌. అరవింద్‌ సినిమా చూశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.