– ఉపాధ్యాయ కొలువు వైపు అభ్యర్థుల చూపు
– టెట్‌కు ఆదరణ అంతంతే…
– ఇప్పటి వరకు 2.51 లక్షల దరఖాస్తులు
– గతేడాది కంటే తగ్గిన అప్లికేషన్లు
– ఫీజు పెంచడమే కారణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థుల లక్ష్యం జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)పైనే ఉన్నది. ఉపాధ్యాయ కొలువు సాధించడంపైనే వారు దృష్టి కేంద్రీకరించారు. ఆవైపుగానే వారు మొగ్గుచూపుతున్నారు. 2017, అక్టోబర్ 21న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న రద్దు చేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను అదేనెల 29న విడుదల చేసింది. జూన్ 20 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువున్నది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ రాతపరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
టెట్‌పై డీఎస్సీ ప్రభావం
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను మార్చి 14న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. టెట్ దరఖాస్తుల సమర్పణకు ఈనెల 20 వరకు గడువున్నది. ఇప్పటి వరకు దరఖాస్తులపై ఆ ప్రభావం పడింది. టెట్ పేపర్-1కు 90,789 మంది, పేపర్-2కు 1,60,857 మంది కలిపి 2,51,646 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతం కంటే దరఖాస్తులు భారీగా తగ్గడం గమనార్హం. టెట్ దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చేనెల 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో రాతపరీక్షల వల్ల దరఖాస్తు ఫీజు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఆఫ్‌లైన్‌లో టెట్ నిర్వహించినపుడు దరఖాస్తు ఫీజు రెండు పేపర్లకు కలిపి రూ.400 ఉన్నది. ఇప్పుడు ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి కట్టాలని నిర్ణయించారు. ఫీజు తగ్గించాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఫీజు తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయినా ఎలాంటి మార్పు లేదు. టెట్ దరఖాస్తులు తగ్గడానికి ఫీజు పెరగడం కూడా ఓ కారణంగా ఉన్నది. టెట్ కాలపరిమితి జీవితకాలం ఉండడంతో ఎక్కువ మంది మార్కులు సంపాదించిన వారు దరఖాస్తు చేసేందుకు మొగ్గు చూపలేదు. మరోవైపు జులైలోనే డీఎస్సీ రాతపరీక్షలున్నాయి. ఎక్కువ మంది ఉపాధ్యాయులు డీఎస్సీ రాసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
అందుకే టెట్ దరఖాస్తులు తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ 15న నిర్వహించిన టెట్ పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది కంటే పేపర్-1కు 1,78,768 పేపర్-2కు 47,641 దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇంకోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. టెట్ దరఖాస్తులు తగ్గడానికి ఇదీ ఓ కారణంగా ఉన్నది.
ఉపాధ్యాయుల్లో ఇంకా గందరగోళమే…
ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టెట్‌పై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. పలు అంశాల్లో వివరణ ఇవ్వాలంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ)ని పాఠశాల విద్యాశాఖ కోరింది. కానీ ఇంత వరకు వివరణ రాలేదు. దీంతో ఉపాధ్యాయులు టెట్ రాయాలా? వద్దా? అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో నాలుగు వేల మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్‌ఎం) ఉన్నారు. మిగిలిన లక్ష మందిలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉన్నది. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. ఎన్‌సీటీఈ నుంచి వివరణ రాకపోవడంతో ఉపాధ్యాయులు టెట్ దరఖాస్తు చేయలేదని తెలుస్తున్నది.