కుల సంఘాలపై గురి

Targeting caste communities– ప్రధాన పార్టీల అభ్యర్థుల మంతనాలు, దావతులు..
– నజరానాలతో తిప్పుకునే ప్రయత్నం
– సమస్యలను ప్రస్తావిస్తూ సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం
నవ తెలంగాణ-సూర్యాపేట
సామాజిక తరగతులపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. గంపగుత్తగా ఓట్లు దండుకునేందుకు కుల సంఘాలపై కన్నేశాయి. ఆయా సామాజిక తరగతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు కుల సంఘాల నాయకులను, ఇతర ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఫంక్షన్‌హాల్‌లతోపాటు, పండ్ల తోటల్లో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కులాల సంఘాల ఓట్లను బట్టి నజరానాలు ముట్ట జెప్పుతున్నారు. వీరిని మచ్చిక చేసుకుంటే గంపగుత్తగా ఓట్లు పడతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవ హరిస్తున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీఎస్పీ, బీజేపీ కుల సంఘాల ఓట్లపై దృష్టిసారించాయి. ఇందుకుగాను అభ్యర్థులు నగదు ప్యాకేజీలను నజరానాలుగా అందజే స్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇది సూర్యాపేట నియోజకవర్గంలో హైస్పీడ్‌లో ఉన్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌, బీఎస్పీ అభ్యర్థులు పలు సంఘాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఖర్చుకు వెనుకాడకుండా సంఘాల ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంలో తనకున్న ఓట్లను రక్షించుకునే పనిలో పడింది. ఆ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంప్రదాయ ఓట్లను కాపాడుకుంటూనే గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
ఉమ్మడి కుటుంబాలపై ఆరా..
ఉమ్మడి కుటుంబాలతోపాటు ఉద్యో గాలు, వ్యాపారాలు నిర్వహించే వారి కుటుంబాల గురించి అభ్య ర్థులు ఆరా తీస్తున్నారు. స్వయంగా కలిసి లేక ఫోను ద్వారా మాట్లాడుతూ ఆయా కుటుంబాలకు చెందిన ఓట్లు తమ పార్టీ అభ్యర్తికే వేయాలని స్థానిక నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పలువురిని పార్టీలో చేరేలా చొరవ చూపిన నేతలు ఈసారి తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎవరు చెబితే ఓటరు కుటుంబం తమ వైపుకు మళ్లుతుందో తెలుసుకొని మాట్లాడిస్తున్నారు.
ఓటు మాట కోసం దావతులు..
మహిళా సంఘాలు, కుల సంఘా లతో అభ్యర్థులు ఓటు మాట తీసుకునేలా సభలు, సమావేశాలు, దావతులు నిర్వహిస్తున్నారు. గంపగుత్తగా ఈ ఓట్లు తమకే పడతాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయాలకు దూరంగా ఉండే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర రంగాల్లోని కుటుంబాలపై దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అనుచర నాయకులు గుర్తిస్తున్నారు. వారిని కలవడం లేదా ఫోన్లో మాట్లాడటం ద్వారా తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు మట్టిపెల్లి సైదులు, మల్లు లక్ష్మీ మాత్రం నీతి నిజాయితీ, పార్టీ సిద్ధాంతాలతో ముందు కెళ్తూ తమను గెలిపిస్తే సమస్యలపై అసెంబ్లీలో ప్రజల గొంతుక అవుతామంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు.