– రెండున్నరేండ్లలో 1.54 కోట్ల మంది తొలగింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) లబ్దిదారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాది తగ్గిస్తోంది. దాదాపు రెండున్నరేండ్లలో 1,54,20,502 మంది లబ్దిదారులను తొలగించింది. లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో 10,79,92,336 మంది రైతులు పీఎం కిసాన్‌లో లబ్దిదారులుగా ఉండగా, వారికి రూ.67,147.36 కోట్లు ఇచ్చారు. 2022-23లో వారి సంఖ్య 10,74,35,548కి తగ్గగా, ఇచ్చే మొత్తం కూడా రూ.58,303.25 కోట్లు తగ్గింది. అంటే ఏడాదిలో 5,56,788 మంది లబ్దిదారులను తొలగించారు. అలాగే పీఎం కిసాన్ మొత్తం కూడా రూ.8,844.11 కోట్లు కోత విధించింది. 2023-24లో లబ్దిదారుల సంఖ్య 9,90,30,164 కి తగ్గింది. అంటే ఏడాదిలో 84,05,384 మంది లబ్దిదారులను తొలగించారు. 2024-25 (2024 జులైౖ 22)లో లబ్దిదారుల సంఖ్య 9,25,71,834కి తగ్గింది. ఏడాదిలో 64,58,330 లబ్దిదారులను తొలగించారు.తెలంగాణలో 2020-21లో 36,37,112 మంది లబ్దిదారులు ఉండగా, 2021-22కి 36,53,195 మందికి పెరిగారు. 2022-23లో 47,83,989 మంది ఉండగా, 2023-24లో 44,88,790 మందికి తగ్గారు. 2024-25 (2024 జులై 22) నాటికి లబ్దిదారుల సంఖ్య 41,28,288 మంది ఉన్నారు.