తర్జుమా తరంగిణి

తర్జుమా తరంగిణిఒక పాటను మోస్తూ …

లోపల ఒక పాటను మోస్తూ
అటూయిటూ తిరుగుతుంటాన్నేను
అందుకే నా శరీరం రాయిలా,
నా కళ్లు జ్వలించే దివిటీలలా,
నా వేళ్లు పదునైన కత్తుల్లా ఉంటాయి
పాటను పదిలంగా ఉంచేందుకు
ఇవన్నీ అవసరం మరి
ఒక మనిషెవరైనా ఎప్పుడైనా నాకు తారసపడితే
రాయిలాంటి నా శరీరం వెన్నలా కరుగుతుంది,
కాగడాల్లాంటి నా కన్నుల్లోంచి
శీతల జలాల ఊటలు శిరసెత్తుతాయి,
నా చేతివేళ్లు సున్నితమైన సుమదళాలౌతాయి
ఆ వేళ నా పాటను ఆ మనిషిలోకి వొంపుతాన్నేను
అప్పుడు,
ఆ వ్యక్తిలో ఈ మార్పులు జరుగుతాయి:
శరీరం రాయిగా మారుతుంది,
కళ్లు మండే దివిటీలౌతాయి,
వేళ్లు పదునైన కత్తులౌతాయి
ఆ వ్యక్తిలో నా పాట భద్రంగా ఉంటుంది!
ఆంగ్లమూలం: లలిత్‌ మగోత్రా
అనువాదం: ఎలనాగ