విందు.. పసందు..

Dinner.. Taste..– ఓటర్లను ఆకట్టుకుంటున్న నేతలు
– ఎన్నికలవేళ గంప గుత్తగా ఓట్లకు గాలం
– పోటాపోటీగా అభ్యర్థుల ప్రత్యేక సమావేశాలు..
– ఖరీదైన మద్యం, విందుతో రోజూ మజా
– మల్కాజిగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రత్యేక నజర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గం మల్కాజిగిరి. ఈ సెగ్మెంట్‌లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగడం అంత ఈజీ కాదు. నామినేషన్ల ఘట్టం ముగిసి పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను మరింత త్వరగా ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ప్రచారంలో ఫుల్‌ బిజీ అయిపోయారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు తమకు గంపగుత్తగా పడేలా చూసుకుంటున్నారు. ముఖ్య నాయకులతోపాటు ద్వితీయ శ్రేణి లీడర్లను సైతం ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఉదయమంతా ప్రచారం చేస్తూ.. సాయంత్రం తమ ముఖ్య అనుచరులు, నేతలను విందులతో పసందు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన ఈటల రాజేందర్‌, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తమదైన శైలిలో ప్రచార రంగంలోకి దిగారు. ఎలాగోలా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు కుల, మత, ఉద్యోగ, కాలనీ, కార్మిక ఇలా రకరకాల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సంఘాలతో మమేకం..
వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు గంపగుత్తగా ఓటర్లను వలలో వేసుకునేందుకు కుల సంఘాలు, రకరకాల యూనియన్లు, కాలనీల ప్రెసిడెంట్లతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నారు. ఎమ్మార్పీఎస్‌, మాజీ సైనికులు, విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం, కాలనీ అసోసియేషన్లు, సెటిలర్లు, రెడ్డి సంఘం, ఐటీ ఎంప్లాయీస్‌ లాంటి వారితో మమేకమవుతూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని, డిమాండ్లను నెరవేరుస్తామని హామీలు సైతం ఇచ్చేస్తున్నారు.
కళకళలాడుతున్న మద్యం షాపులు
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మద్యం దుకాణాలు పగలు, రాత్రి తేడా లేకుండా కళకళలాడుతున్నాయి. నేతలు తమ ప్రచారంలో పాల్గొన్న వారికి మద్యం, బిర్యానీ పొట్లాలు అందించి ఖుషీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకూ మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైన్స్‌ షాపుల యజమానులు ఆబ్కారీ అధికారులతోపాటు పోలీసులకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. మద్యం షాపుల యజమానులతో ముందే మాట్లాడుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. నేతలు, నాయకులు, కార్యకర్తల అవసరాలు తీరేలా డబ్బులు కూడా సమకూరుస్తున్నట్టు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
37 లక్షల ఓటర్లు.. 3,228 పోలింగ్‌ కేంద్రాలు..
మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. కంటోన్మెంట్‌ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 5 లక్షల కంటే అధికంగా ఉన్నారు. పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 3,228 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను ఏ అభ్యర్థీ కలవడం అంత సులభం కాదు. దాంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపగుత్త ఓట్లపై దృష్టి సారించారు. ఓటర్లు తమ చేతిలో నుంచి జారిపోకుండా ప్రతి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా మద్యం, మాంసంతోపాటు ఇతర ఖరీదైన ఆహార పదార్థాలను సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. బర్త్‌ డే, పెండ్లీళ్లు, ఇతర ఫంక్షన్లకు సైతం హాజరవుతున్నారు.