– జియోకు తీవ్ర పోటీ
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద డీటీహెచ్ సేవల కంపెనీ టాటా ప్లేను కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతోందని సమాచారం. అదే జరిగితే డిజిటల్ టీవీలో రిలయన్స్ జియోకు తీవ్ర పోటీ ఎదురు కానుంది. ఓటీటీ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ టీవీ విభాగంలో ఎయిర్‌టెల్ తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు ఎయిర్‌టెల్ అడుగులు వేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలుపడ్డాయి. 2017లో టాటా కన్య్సూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన తర్వాత ఇరు సంస్థల మధ్య జరగనున్న రెండో ఒప్పందం కానుంది. ఒక వేళ టాటా ప్లేను కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగాల్సి ఉంటుంది.
ప్రస్తుతం డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) విభాగంలో టాటా ప్లే 2.07 కోట్ల ఖాతాదారులతో ఏకంగా 32.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. డీటీహెచ్ సేవల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్నప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.353.8 కోట్ల నష్టాలను చవి చూసింది. మరోవైపు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ 27.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా ప్లే కొనుగోలు జరిగితే ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ ఒక్కసారిగా పెరగనుంది. దేశ మార్కెట్‌లో ఆ సంస్థ మార్కెట్ వాటా 50 శాతానికి ఎగువకు చేరుకోనుంది. దీంతో రిలయన్స్ జియోకు తీవ్ర పోటీని ఇవ్వనుందని.. ధరల్లో మార్పులు రావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.