నిద్ర పట్టడం లేదని ఓ తమ్ముడు అటూ ఇటూ పొర్లుతూ చూసిన సెల్లును మళ్ళీ మళ్ళీ చూడడం ఇష్టంలేక లతా అక్కయ్య పాడిన ”నిదురపోరా తమ్ముడా” పాట పెట్టుకున్నాడు. ఆహా ఎంత మంచి గొంతు, ఎంత మంచి పాట నిదురపోరా తమ్ముడా, నిదురలోన గతమునంతా, నిముసమైనా మరచిపోరా… నిజంగా పట్టాలే కాని నిదురకు మించిన వైద్యం లేదు. కరుణ లేని, ఈ జగాన కలత నిదురే మేలురా… ఓహో అక్కయ్యంటే అలా ఉండాలి. అమ్మలోనుండి ”అ” ను తీసుకున్నారు మరి ”క్క” ను ఎక్కడినుండి తీసుకున్నారో అనుకుంటూ తమ్ముడు గతము మాత్రమే కాదు వర్తమానాన్ని మరచి పోదామని లత అక్క పాట వినుకుంటూనే నిద్ర పోయాడు.
తమ్ముడు అమ్మను పిలుచుకొని పంటి డాక్టరు దగ్గరికి పోయాడు. ఆయన తమ్ముడి తల్లి నోరంతా చూసి
”ఈ రెండు పళ్ళు ఎప్పుడు ఊడాయి, ఎవరైనా డాక్టరు పీకాడా”
”లేదండి, అవంతట అవే ఊడిపోయాయి” అమ్మ బదులు తమ్ముడు సమాధానమిచ్చాడు.
”ఐతే ఫ్రీగా పోయాయి కాబట్టి రెండింటికీ కలిపి పద్దెనిమిది శాతం జీఎస్టీ కట్టాలి. ఒక్కో దానికి మూడు వేల చొప్పున అవుతుంది కాబట్టి రెండు పళ్ళకు ఆరు వేలు ఫీజు, దానిపై ఒక వేయి ఎనభై రూపాయలు అంటే మొత్తం ఏడు వేలా నూట ఎనభై రూపాయలు కౌంటరులో కట్టి రండి. మా క్లినిక్ మొత్తం సీసీ కెమెరా కన్నుల దష్టిలో ఉన్నాయి. మీరు తప్పించుకున్నా లాభం లేదు. ఇక్కడ జరిగే విషయాలన్నీ ప్రభుత్వానికి అంటే నిర్మలా మేడంకు ఈపాటికి పోయే ఉంటాయి. ఏకకాలంలో జీఎస్టీ వాళ్ళకూ చేరి ఉంటాయి.”
”సరే సార్ నొప్పి ఉన్న పన్నుకోసం మళ్ళీ వస్తాం, ముందు ఈ పాత ఫీజు, పన్ను రెండూ కలిపి కట్టి పోతాం” అని పైకి అని ”అసలు మనిషికి పండ్లు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది” అని లోపల అనుకొని బయలుదేరాడు తమ్ముడు.
ఇంతలో అమ్మే అడిగింది డాక్టరును ”ఈ కెమెరాలేవో అసలే లేని పంటి డాక్టర్లు ఉండరా నాయనా” అని.
”ఉండవమ్మా. అలా ఉంటే వాళ్ళు నెలకు ఇంత పన్ను పీకే పన్ను కట్టాలని రూలు త్వరలో వస్తుందట. అందుకే అందరూ ఈ సీసీ కెమేరాలు పెట్టేస్తున్నారు”.
”ఈ పన్ను పోటు ఏమిటిరా? ఇప్పుడు ఇలాగే ఇంటికి పోవాలా?”
”ఒక్క వారం తట్టుకో అమ్మా, నా కారు అమ్మేస్తున్నాను కదా. వచ్చే వారం వచ్చి చేయించుకుందాం. ఈ లోపు నీవు ఆ లవంగాలు పంటి దగ్గర పెట్టుకుంటుంటావు కదా అలా చేయి”
ఇంతలో సీసీ కెమేరాలోనుండి ఎ.ఐలోఉండి కంప్యూటర్ గొంతు వినిపించింది
”లవంగాల పై పన్ను, లవంగాలపై పన్ను”
”ఆ మాటేదో బయట మాట్లాడొచ్చు కదమ్మా!!”
—
రెండేళ్ళకు ముందు మిత్రుడెవరో మంచి విదేశీ కంపెనీ కారు చవగ్గా అమ్ముతున్నాడని ముచ్చట పడి కొన్న ఆ కారును అమ్ముదామని మెకానిక్కు దగ్గరికి తీసుకుపోయాడు.
”ఏం సార్ మళ్ళీ రిపేరా”
”లేదయ్యా, దీన్ని అమ్మేద్దామనుకుంటున్నా” అనగానే మెకానిక్కు కంప్యూటర్‌లో ఏదో కొట్టాడు. మొదట కార్ల బొమ్మలొచ్చి తరువాత ఏవో అంకెలు, సంఖ్యలు కనిపించాయి.
”చెప్పండి సార్ ఎంతకు అమ్ముతారు?”
”ఎంత వస్తుంది? నేనైతే రెండు లక్షలకు అమ్ముదామనుకున్నా. ఎందుకంటే నేను కొన్నది మూడు లక్షలకు”.
అవన్నీ కొట్టాడు మెకానిక్కు తమ్ముడు కంప్యూటర్లో. దాన్ని తెరపై చూపిస్తూ ”చూడండి సార్ ఇరవై లక్షల కారును మీరు కొన్నది మూడు లక్షలకు. అంటే పదిహేడు లక్షలు తేడా, దానిపై జీఎస్టీ కట్టాలి. అలాగే మీరు అమ్ముదామనుకున్న రెండు లక్షలపై కూడా ఈ పన్నే కట్టాలి”
”ఐతే ఒక ఉపాయం. దీన్ని మనం పది లక్షలకు అమ్మినట్టు చూపిద్దాం”.
”నల్ల ధనం, నల్ల ధనం” అంటూ సీసీ కెమేరాలోనుండి కత్రిమ మేధ గొంతు వినిపించింది ఇంగ్లీషులో.
—
ఇంకో చెల్లి పది నెలలూ నిండాయని కానుపు కోసం ఆసుపత్రికి పోతుంది. లేక లేక పుట్టబోతున్న పాపనో బాబునో తలచుకుంటూ వస్తున్న నొప్పుల్ని పంటికిందే అదిమి పట్టింది. భర్త ఆటోలో నుండి దిగడానికి ముందే దిగి తనను జాగ్రత్తగా దిగడానికి సహకరిస్తున్నాడు.
ప్రసూతి వార్డులో నుండి ఒక నర్సు వచ్చింది. వచ్చీ రాగానే ”మీ ఆయన ఏదీ..” అనడిగింది. అక్కడ ఆటోకు డబ్బు కట్టి వస్తున్నాడు అనేంతలో వచ్చేశాడాయన.
”ఇప్పుడు చెప్పండి మీరెంతమంది? అంటే మీ తోబుట్టువులెంతమంది”
”ఎనిమిది” భర్త బదులిచ్చాడు. ఆధార్ కార్డు నెంబరు కంప్యూటర్లో కొట్టి చూసిన నర్సమ్మ అడిగింది
”ఇందులో పదిమందిని చూపిస్తోంది?”.
”అంటే ఇద్దర్ని వాళ్ళ అన్నకు ఒకరిని, అక్కకు ఒకరిని దత్తతకిచ్చాడు మా నాన్న”.
”మీకు ఇది మొదటి సంతానం. అంటే ఏడుగురు తక్కువన్న మాట. ఎక్కువమందిని కనాలని ప్రభుత్వమే చెప్పింది కదా. మీరు ఆ ఏడుగురికి, అలాగే ఇద్దరిని దత్తతకిచ్చా రంటున్నారు కాబట్టి ఆ ఇద్దరికి అదనంగా జీఎస్టీ కట్టాలి”
సీసీి కెమేరాలోనుండి ఎ.ఐ. గొంతు వినిపించింది ”కరెక్ట్ కరెక్ట్” అని. అలాగే ఎంత కట్టాలో కూడా చెప్పింది.
”మా నాయన సంతానానికి నా సంతానానికి సంబంధమేమిటండి. ఆ వ్యత్యాసానికి పన్నులేమిటండి?”.
ఇంతలో నొప్పులు పడుతున్న తమ్ముడి భార్య ”సడన్ గా నొప్పులు ఆగిపోయాయండి. మళ్ళీ రేపొద్దాం పదండి” అంది.
”మీరు ఏ ఆసుపత్రికో పోవాలని ప్లాన్ వేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఇవే పన్నులే” అనింది నర్సమ్మ.
కెమేరాలోని గొంతు ”కరెక్ట్ కరెక్ట్” అంది. అది నిర్మలక్క గొంతులానే ఉంది.
—
”వద్దు నిర్మలక్కా వద్దు వద్దు అన్ని పన్నులొద్దు! వచ్చే మామూలు జీతంలో అన్ని పన్నులు కట్టలేను కట్టలేను….!!”
తమ్ముడు కలవరిస్తున్నాడు. తల్లి కొడుకు మొహం పై నీళ్ళు పోసి లేపింది.
”అంటే ఇది కలా? లేక నిజమా? రెండూ కావచ్చు!!”
అప్పుడర్థమైంది తమ్ముడికి విదేశీ అప్పు లోనుండి ”అ” ను, పన్నుల లెక్క నుండి ”క్క” ను కలిపి ఈ నిర్మలక్కకు పెట్టారని……
కొత్త కొత్త పన్నులతో కొత్త సంవత్సరానికి స్వాగతం … సుస్వాగతం.
ఇంతలో టీవీలో వార్త ”కొత్త సంవత్సరానికి పంపే శుభాకాంక్షలపై పన్ను వేయాలని ఆర్ధికమంత్రికి సూచనలిచ్చిన ఫిక్కి…”
అమ్మా నా మీద ఓ బిందెడు నీళ్ళు చల్లవే…..
తమ్ముడు అరుస్తున్నాడు.
– జంధ్యాల రఘుబాబు, 9849753298