‘టాక్స్‌’ టెర్రరిజం

'Tax' Terrorismప్రతిపక్షం లేని ప్రజాతంత్ర వ్యవస్థను సృష్టించడం కోసం మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వేయని ఎత్తులు లేవు. ఆర్థికంగా ప్రతిపక్షం పీక నొక్కడం ద్వారా ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అన్న మోడీ ‘కల’ నెరవేర్చుకునేం దుకు ఇదొక పన్నాగం కావచ్చు. దేశంలో అధికార పక్ష నేతల నుంచి కార్పొరేట్‌ సంస్థల అధినేతల వరకు ఎంతో మంది పన్ను ఎగవేతదారులున్నారు. అంతేందుకు నిన్నగాక మొన్న నీరవ్‌ మోడీ ఆస్తులు వేలానికి లండన్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. సదరు నేత మన దేశానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలెంత? దేశం వదిలి పారిపోయిన విజరుమాల్యాలెందరు? అలాంటి వారిని వదిలేసి అసలు పన్నే కట్టనక్కరలేని రాజకీయ పార్టీలకు జరిమానాలు విధిస్తూ నోటీసులు మీద నోటీసులు జారీ చేయడం దేనికి సంకేతం? అంటే ‘విశ్వగురు’కు ఎక్కడో ఓటమి భయం పట్టుకుంది. 370 గ్యారంటీ అంటూ మోగించిన కంచు ఢంకా ఇప్పుడెందుకో ఓటుపోతుంది.
కాంగ్రెస్‌ సహా సీపీఐ, సీపీఐ(ఎం)లకు సైతం ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. లెక్కలు సరిగ్గా లేవంటున్న మొత్తం రూ.లక్షల్లో ఉంటే, వీరు విధించిన జరిమానాలు మాత్రం కోట్లలో ఉండటం విచిత్రం. మోడీ లక్ష్య సాధనకోసం ఆదాయపు పన్ను శాఖ నిర్లజ్జగా తన శాఖ సకల నియమాలను బాహాటంగా ఉల్లంఘించి బీజేపీ చేతిలో పరిచారికగా మారింది. మొత్తంమీద కాంగ్రెస్‌కు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం అంటే ఆ పార్టీని ఆర్థికంగా నిస్తేజం చేయడమే. అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తమ నాయకుల పర్యటన కోసం కనీసం రైలు టికెట్లు కొనే స్థితిలో కూడా లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచన.
లెక్కలు చూపడంలో కాంగ్రెస్‌ నెల రోజులు అలస్యం చేసిందట. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్‌ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్లి అక్కడి సిబ్బందిని బెదిరించి, భయపెట్టి కాంగ్రెస్‌ ఖాతాల నుంచి రూ.115 కోట్లు ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేయించుకుంది. ఈ క్రమం అంతా చూస్తూ ఉంటే మోడీ ప్రభుత్వ తాత్పర్యమేమిటో ఎవరో చెప్పాల్సిన పనిలేదు. 2017-18 నాటి లెక్కలు చూపనందుకు కూడా కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారట. ఇంతకుముందు ఆరేండ్ల తరవాత పాత కేసులు తవ్వి తీసేవారు కాదు. 2022లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి నప్పుడు ఆరేండ్ల గడువు కాస్తా మూడేండ్లకు తగ్గించారు కదా! మరి ఈ దాడులేంటి?
నిజానికి రాజకీయ పార్టీలు ఆదాయం పన్ను చెల్లించనవసరం లేదు, కానీ లెక్కలు మాత్రం ఆదాయపు పన్ను శాఖకు అందజేయాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పొరపాటు చేసిందనే అనుకున్నా బ్యాంకు ఖాతాలు జప్తు చేయించడానికి ఎన్నుకున్న సమయం ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే తెలుస్తోంది. కాంగ్రెస్‌ చూపాల్సిన లెక్కల్లో 0.7 శాతం లెక్కలు చూపనందుకే ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం వెనక విపక్షాలను ఎన్నికల సమయంలో ఆర్థికంగా అశక్తం చేయాలన్న కుట్ర దాగి ఉందనుకోవడానికన్నా మించిన కారణం ఏమీ కనిపించడం లేదు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికే తమ బ్యాంకు ఖాతాలు జప్తు చేశారని కాంగ్రెస్‌ ఆక్రోశించింది. సీపీఐ(ఎం) సైతం ‘ మేం ఎలాంటి తప్పు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మేం వ్యవహారిస్తున్నామని’ స్పష్టం చేసింది. అయినా, ఆదాయ పన్ను శాఖ తమ నోటీసుల పర్వం కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్‌ విషయంలోనో, వామపక్షాలపైనో ఈ దుర్నీతికి పాల్పడిందని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ తీవ్రంగా పట్టించుకోవలసిన అంశమిది.
ఎన్నికల బాండ్లలో బీజేపీ బండారం బయటపడిన వెనువెంటనే కేంద్రం కాంగ్రెస్‌పై ఆదాయ పన్ను శాఖను ఉసిగొల్పింది. ఎన్నికల ముంగిట లెక్కా పత్రం, హద్దూ పద్దూ లేని జరిమానాలు విధించి ప్రతిపక్షాలను ఎన్నికల ప్రచారం కూడా చేసుకోనియకుండా ముందే ముందరి కాళ్లకు బంధాలు వేస్తోంది అధికార పక్షం. కాబట్టి ఇది ముమ్మాటికీ ‘టాక్స్‌ టెర్రరరిజ’మే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని దర్యాప్తు సంస్థలు బీజేపీ అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయి. మరో వైపు జార్ఖండ్‌ (మాజీ) సీఎం సోరెన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లను అరెస్టు చేయడం, ఇతరులను దర్యాప్తుల పేరుతో వేదించడం, ఇదంతా గమనిస్తే ఎన్నికల్లో ఓటమి కమల దళాన్ని ఎంతలా కలవరపెడుతోందో అర్థమవు తుంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కాదు వీరి లక్ష్యం. ప్రతిపక్ష ముక్తీ భారత్‌. ఏక పార్టీ వ్యవస్థ. రష్యాలో ప్రతిపక్ష నాయకుడు నవలానీ బ్యాంకు ఖాతాలను ఇలాగే జప్తు చేస్తే… వాటిని కోర్టు రద్దుచేసింది. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు షాబాజ్‌ ఖాతాలు ఇలాగే జప్తు చేయించారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య ఛాయలు ఇసుమంతైనా లేని దేశాల స్థాయికి దిగజారుస్తున్నారు. చట్ట విరుద్ధంగా ప్రతిపక్షాల రెక్కలు కత్తిరించడానికి చట్టాన్నే దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు. జన జాగృతే దీనికి నిష్కృతి.