నిండుకుంటున్న టీబీ మందులు

న్యూఢిల్లీ : దేశంలో క్షయ వ్యాధి నివారణకు వాడే మందులకు కొరత వచ్చింది. గత ఏడు నెలల కాలంలో ఇలా కొరత ఏర్పడడం ఇది రెండోసారి. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని పలు ఆరోగ్య కేంద్రాలలో మందుల నిల్వలు నిండుకున్నాయి. కొన్ని రాష్ట్రాలకు అరకొరగా సరఫరా అవుతున్నప్పటికీ అవి ఏ మాత్రం చాలడం లేదు. గత సంవత్సరం ఆగస్టులో కూడా పలు రాష్ట్రాల్లో క్షయ మందులకు కొరత ఏర్పడింది. గత నెల 18న కేంద్ర టీబీ విభాగం రాష్ట్రాలకు లేఖలు రాసింది. మూడు నెలలకు సరిపడా మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మందులు సేకరిస్తోందని, అయితే అనూహ్య, ఇతర పరిస్థితుల కారణంగా సరఫరాలలో జాప్యం జరగవచ్చునని టీబీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజేంద్ర జోషీ ఆ లేఖల్లో వివరించారు. సాధారణంగా రాష్ట్రాల వద్ద ఆరు నెలలకు సరిపడా మందులు నిల్వ ఉంటాయి. అయితే ఇప్పుడు నెల రోజుల అవసరాలు తీర్చే మందులు కూడా వాటి వద్ద లేవు. సొంతగా మందులు కొనుగోలు చేసేందుకు పలు రాష్ట్రాల నోడల్‌ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో మందుల కొనుగోలు కష్టతరంగా మారింది. మందుల కొరతపై కర్నాటక ఆరోగ్య మంత్రి దినేష్‌ గుండూరావు ఈ వారం ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య మంత్రికి ఓ లేఖ రాశారు. గత సంవత్సరం దేశంలో 25.55 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1.43 లక్షలు చిన్న పిల్లల కేసులు. క్షయ వ్యాధి నివారణకు వాడే రెండు ఔషధాల సరఫరాకు జనవరిలోనే అంతరాయం ఏర్పడింది.