నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు టీసీపీఎస్‌ఈఏ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కొమరయ్యను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్, హన్మండ భాస్కర్ బుధవారం హైదరాబాద్‌లో కలిసి మద్దతు లేఖను అందించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చి ఏడాది గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని కొమరయ్య అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని చెప్పారు. సీపీఎస్‌ను రద్దు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందన్నారు. ఉద్యోగుల జీవితాలు భద్రత లేని సీపీఎస్‌ను రద్దు చేయాలనీ, లేకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.