హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో ప్రతిభాంతులైన క్రీడాకారులకు కొదవ లేదని, సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పిస్తే పల్లెల నుంచి ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలమని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) చైర్మెన్ కె. శివసేనా రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, టీడీసీఏ అధ్యక్షులు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ గ్రౌండ్‌లో తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అండర్-17 క్రికెట్ టోర్నమెంట్‌ను శివసేనా రెడ్డి ప్రారంభించారు. అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో గ్రామీణ క్రికెటర్లకు సరైన అవకాశాలు లభించటం లేదు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివద్ది కోసం బీసీసీఐ నుంచి గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. మార్చిలో అమెరికా క్రికెట్ అకాడమీ జట్టు మన తెలంగాణ గ్రామీణ క్రికెటర్లతో పోటీపడేందుకు హైదరాబాద్‌కు రానుంది. గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు దక్కేందుకు టీడీసీఏ పోరాటం సాగుతుంది’ అని అన్నారు. తొలి మ్యాచ్‌లో ఖమ్మంపై వరంగల్ గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో కరీంనగర్‌పై నల్లగొండ విజయం సాధించింది.