హైదరాబాద్: అమెరికా క్రికెట్ బోర్డు చైర్మెన్ వేణు రెడ్డి పిసికెను తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే కార్యక్రమంలో సత్కరించనుంది. నల్లగొండ జిల్లాకు చెందిన వేణు రెడ్డి ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లినా.. క్రికెట్‌పై మక్కువతో యుఎస్‌ఏలో క్రికెట్ అభివృద్దిపై దృష్టి నిలిపారు. అమెరికా వేదికగా 2024 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణలో వేణు రెడ్డి కీలక పాత్ర పోషించారు. అమెరికా క్రికెట్ అభివృద్దికి విశేష కృషి చేస్తున్న వేణు రెడ్డిని టీడీసీఏ అభినందన సభ నిర్వహించనుంది. తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల కోసం అండర్-16 టోర్నమెంట్ ట్రోఫీలను సైతం వేణు రెడ్డి ఆవిష్కస్తారని టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.