కళ్లకు గంతలతో టీడీపీ నిరసన

TDP protests with blindfoldsఅమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు ఆదివారం కళ్లకు గంతలతో నిరసన చేపట్టారు. ‘జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం’ పేరుతో సాయంత్రం 7గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో భార్య బ్రాహ్మణితో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ‘నిజం గెలవాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంగళగిరిలోని టీడీపీి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, బి.ప్రసాద్‌, నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తదితరులు కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్‌లో ఉంచారని చెప్పారు. అరెస్టు చేసి 51 రోజులు గడిచినా, 50పైసల అవినీతి జరిగిందని కూడా నిరూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఐదేళ్లుగా కోర్టుకు వెళ్లకపోవడం, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్‌రెడ్డి అరెస్టు కాకపోవడం వంటివి వ్యవస్థలను మేనేజ్‌ చేయడమేనని పేర్కొన్నారు. ఆ పార్టీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ ఢిల్లీలోని తన నివాసం వద్ద, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో నిరసన చేపట్టారు.