గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతినవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
గుండెపోటుతో దివ్యాంగ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మైలవార్‌ మమత(29) గాదిగూడ మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇంట్లో ఉన్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. మమతను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించగా ఆ రోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతున్న క్రమంలో సాయంత్రం వేళ మమత మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతురాలికి 5నెలల బాబు ఉన్నాడు. తల్లి మరణించడంతో పాల వయస్సులో ఉన్న బాబు పరిస్థితి కాలనీవాసులను కలిచి వేసింది.
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
సమగ్ర శిక్షణలో పని చేస్తున్న వారిలో మరొక గుండె ఆగిపోయిందని, ఇప్పటివరకు గుండెపోటుతో 163 మంది మరణించారని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్‌ మాధవ్‌ పేర్కొన్నారు. 5 నెలల బాబుకు తల్లి దూరమైందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు సంఘం తరపున సంతాపం ప్రకటించారు. తోటి ఉద్యోగికి తోచిన న్యాయం చేయాలని కోరారు. సమగ్ర శిక్షణలో ఎన్నో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మమత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.