
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ రాష్ట్రంలోని శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు వై.అశోక్ కుమార్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఎస్.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో టీఎస్.యూటీఎఫ్, టిపిటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించాల్సిన శాసనమండలిలోకి కార్పొరేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దళారులు ప్రవేశించడం వల్ల విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్నారు. కావున ఈ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ – ఆదిలాబాద్ -మెదక్- నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న కార్పొరేట్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ దళారులను ఓడించి, ఉద్యమాలతో అనునిత్యం ఉపాధ్యాయులు, విద్యారంగం అభివృద్ధికి పాటుపడే అభ్యుదయ ఆలోచనలు, ఆచరణ కలిగిన సామాన్యుడు అశోక్ కుమార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమావేశంల టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె కిష్టన్న, ప్రధాన కార్యదర్శి వి అశోక్, జిల్లా కార్యదర్శి గౌస్ మొహియుద్దీన్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రామేశ్వర్, నాయకులు పాల్గొన్నారు