– 22 వేల ఖాళీలు ఉన్నాయంటున్న టీచర్ల సంఘాలు
– 9,370 ఖాళీ పోస్టులు గుర్తించిన విద్యాశాఖ
– 13,086 భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్
– 6,612 పోస్టులతోనే డీఎస్సీ ప్రకటించిన మంత్రి సబిత
– పదోన్నతులిస్తే 9,979 పోస్టులు ఖాళీ
– వాటిని డీఎస్సీలో కలపని ప్రభుత్వం
– ఖాళీల్లో గందరగోళం…
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 22 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. తెలంగాణలోని పాఠశాలల్లో 18,588 ఖాళీలున్నాయంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రకటించారు. ఇంకోవైపు ప్రాథమిక విద్యలో 11,348, మాధ్యమిక విద్యలో 4,774 కలిపి మొత్తం 16,122 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ నివేదికను సమర్పించింది.
80 వేల కొలువుల భర్తీలో భాగంగా 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అవన్నీ అలా ఉంటే 9,370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా 6,612 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇందులో 5,089 ఉపాధ్యాయ పోస్టులు, 1,523 ప్రత్యేక (డిజెబుల్డ్) టీచర్లకు సంబంధించినవి ఉన్నాయి. దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన 6,612 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
22 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి – చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సరైంది కాదు. 9,979 పోస్టులకు పదోన్నతులిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూడాలి. ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టినా అందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించలేదు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు వారికి నాణ్యమైన విద్య అందుతుంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులుంటే, ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తు న్నారు. అంటే 19,043 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలింది. ఇందులో 1,947 గెజిటెడ్ హెడ్మాస్టర్, 2,162 పీఎస్‌హెచ్‌ఎం, 5,870 స్కూల్ అసిస్టెంట్ కలిపి 9,979 పోస్టులకు త్వరలో పదోన్నతులు కల్పిస్తారు. ఆ లెక్కన చూసినా మిగిలిన 9,064 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. కానీ 6,612 పోస్టులతోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ప్రకటనపై లక్షలాది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టులు మాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
పదోన్నతులకు అడ్డంకి ఏంటీ?
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఒకేసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు విద్యాశాఖ షెడ్యూల్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బదిలీలకు సంబంధించిన అంశం హైకోర్టు విచారణలో ఉన్నది. అది వాయిదా పడుతూ వస్తున్నది. కానీ ఉపాధ్యాయ పదోన్నతులు చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవు. అయినా విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. 9,979 పోస్టులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అందులో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, 2,162 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు ఎస్జీటీలకు పదోన్నతులు లభిస్తాయి. అంటే 8,032 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇంకోవైపు 1,947 గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు.
అయితే 1,947 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అవుతాయి. కానీ అందులో 70 శాతం అంటే 1,363 ఉపాధ్యాయ పోస్టులకు ఎస్జీటీలకు పదోన్నతులివ్వాలి. మిగిలిన 30 శాతం అంటే 584 పోస్టులనే నేరుగా భర్తీ చేయాలి. అంటే పదోన్నతుల ద్వారా 8,616 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం భర్తీ చేసే 6,612 పోస్టులకు అదనంగా 8,616 పోస్టులు కలుస్తాయి. దీంతో 15,228 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలి. కానీ 5,089 ఉపాధ్యాయ, 1,523 ప్రత్యేక టీచర్ పోస్టుల భర్తీకి మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అటకెక్కిన 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే 10 వేల ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకూ అది అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,429 లో ఫీమేల్ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్) హెచ్‌ఎం పోస్టులున్నాయి.
ఇంకా 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉన్నా అది అటకెక్కిందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇంకోవైపు 8,630 భాషా పండితులు, 1,849 పీఈటీలు కలిపి 10,479 మందికి స్కూల్ అసిసెంట్లుగా పదోన్నతులు లభించే అంశం కూడా కోర్టు పరిధిలోనే ఉన్నది. ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం సైతం కోర్టులో ఉన్నందున ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, బీఈడీ లెక్చరర్ వంటి పోస్టులకు పదోన్నతులు లభించడం లేదు.
సీఎం ప్రకటించిన 13 వేల పోస్టులైనా భర్తీ చేయాలి : రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విధంగా 13,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేయాల్సిందే. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం. ఆరేండ్లుగా నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కేవలం 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామనడం సరైంది కాదు. దీంతో అభ్యర్థులంతా ఆందోళనలో ఉన్నారు.