రాష్ట్ర స్థాయికి ఉపాధ్యాయుడు రవివర్మ ఎంపిక

నవతెలంగాణ – కోహెడ
మండలంలోని వింజపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డి.రవివర్మ సైన్స్‌ పరిశోధనలో రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. మండల కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్‌ బోధనలో సృజనాత్మకత, ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ సైన్స్‌ అంశాలపై నివేదికలు రాసేందుకు ఎంపికైనట్లు తెలిపారు. నిత్య జీవనంలో చెసే ప్రతి పనిని సైన్స్‌కు అన్వయము చేస్తే మంచి ఆవిష్కరణలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేహమే ఒక ప్రయోగ శాలగా భావించి మన శరీర వ్యవస్థల ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి అవగాహన చెందించాలన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ సెమినార్‌కు ఎంపిక కావడం మరింత ఉత్సాహం నింపిందన్నారు. మండల విద్యాధికారిని, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉపాధ్యాయుడు రవివర్మకు అభినందనలు తెలిపారు.