భావిభార‌త నిర్మా‌త‌లు ఉపాధ్యా‌యులు

ఆ భవిష్యత్‌ తరాన్ని నిర్మిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తలంచి తన పుట్టిన రోజును దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించేలా ప్రోత్సహించిన డా||సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి జేజేలు.
ఆచార్యుడుగా, మూడు గొప్ప విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్‌గా, దౌత్యవేత్తగా, మొదటి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, దేశ విదేశాలలో భారతీయ తత్వ శాస్త్రాన్ని విశదీకరించిన తత్వవేత్తగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రదర్శించిన ప్రతిభా సామర్థ్యాలు అనితరసాధ్యం.
బాల్యం : 1959 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భాగంగా వుండి తరువాత తమిళనాడులో చేర్చబడ్డ తిరుత్తని పట్టణానికి వలస వచ్చిన కుటుంబంలో జన్మించారు ఆయన. తండ్రి వీరాస్వామి స్థానిక జమిందారు వద్ద చిన్న రెవెన్యూ ఉద్యోగి. తల్లి సీతమ్మ. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. రెండవ కుమారుడైన రాధాకృష్ణన్‌ 1888 సెప్టెంబర్‌ 5వ తేదీన జన్మించారు. తిరుత్తని, తిరుపతి వేలూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్యను, మద్రాసు యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు.
ఆనాటి బాల్య వివాహాల ఆచారం వల్ల 16 సంవత్సరాల వయసున్న రాధాకృష్ణన్‌కు 10 సంవత్సరాల శివకొముకు 1903లో వివాహం జరిగింది. తర్వాత స్కాలర్‌షిప్‌తో డిగ్రీ పూర్తి చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినా విద్య పట్ల మక్కువతో ట్యూషన్స్‌ చెప్తూ యం.ఎ. చదివారు. ఆయన ప్రతిభను చూసి ప్రభుత్వమే టీచర్స్‌ ట్రైనింగ్‌కు పంపించింది. కడు దయనీయమైన ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ కూడా చదువుపై మక్కువను, పట్టుదలను వదలలేదు. 1911లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా నియమితులైనారు. రాధాకృష్ణన్‌ క్లాసు బోధిస్తున్నారని తెలిస్తే, వినడానికి ఇతర కాలేజీల నుండి కూడా విద్యార్థులు బిలబిలా వచ్చేవారంటే ఆయన పాఠాలు ఎంత ఆకర్షించేవారో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఉపాధ్యాయునికి విజ్ఞానం, విశ్లేషణతో పాటు ఆహార్యం (డ్రెస్సింగ్‌) కూడా ముఖ్యమని టీచర్‌ ట్రైనింగ్‌లో (కరిక్యులమ్‌లో) నేర్పిస్తారు. కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తే గల్లీలోని కాన్వెంట్‌ స్కూలు నుంచి ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ వరకూ ఇంగ్లీషు వ్యామోహంలోని విద్యార్థులను ‘డార్లింగ్‌’ అని సంబోధిస్తూ ఫ్యాషన్‌ పేరుతో లిప్‌స్టిక్‌ల నుంచి వెర్రివేషధారణతో ప్రత్యక్షమయ్యేవారికి, నెల గడవడమే కష్టంగా వున్న కాలం నుంచి రాష్ట్రపతి వరకూ ఎదిగినా తన వృత్తికీ, వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే పొడుగాటి (మెడ నుంచి మోకాళ్ల వరకు) వేలాడే సిల్కు లాంగు కోటు, తెల్ల ధోవతి, తెల్లటి మస్లిన్‌ తలపాగా వేషం చెంపపెట్టు కదా!
సంస్కరణలు : విశ్వవిద్యాలయాలకు గ్రంథాలయాలు గుండెకాయ వంటివి అని రాధాకృష్ణన్‌ భావించారు. అందుకే ఏడు వేలు ఉన్న గ్రంథాలయాలను 23 వేలకు పెంచారు. విదేశాలకు వెళ్లినప్పుడు మనదేశంలో నిషేధింపబడిన మార్క్సిస్టు గ్రంథాలను తీసుకొని వచ్చి లైబ్రరీలో చేర్చేవాడు. భోజన శాలలో బ్రాహ్మణ విద్యార్థులకు ప్రత్యేకంగా కాకుండా ఒకే పంక్తిలో భోజనం వడ్డించేలా మార్పు చేశారు. ప్రముఖ దేశ భక్తులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి విప్లవాత్మక రచన ‘మాలపల్లి’ బి.ఎ. విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. ప్రముఖ నాస్తికవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) కాకినాడ కాలేజీలో బోటనీ లెక్చరర్‌గా నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నాడని యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది. గోరాకు తన భావాలను ప్రచారం చేసుకునే హక్కు వుంది. ఏ కళాశాలలోనైనా చేర్చుకోవచ్చని చెప్పారు. ఆయన బోధించే పాఠం గంగా ప్రవాహంలా సాగేది. పరీక్షల కోసమే కాకుండా జీవితంలో ఉపయోగపడే విధంగా ఆయన పాఠం సాగేది. కళాశాల ప్రాంగణం మొత్తం నిశ్శబ్దంగా వుంది అంటే రాధాకృష్ణన్‌ క్లాసు జరుగుతుంది అని మిగిలిన అధ్యాపకులు అనుకునేవారు.
విద్యార్థులతోనే కాకుండా పరిచయస్తులందరితో స్నేహభావంతో రాధాకృష్ణన్‌ వ్యవహరించేవారు. అందుకే ఆయనను ‘బారు ప్రొఫెసర్‌’ అని పిలిచేవారు.
విద్యావ్యవస్థ : నేటికీ నాణ్యమైన, సమానమైన విద్య సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఆర్థికంగా మెరుగైన విద్యార్ధులకు కార్పొరేట్స్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి విద్యను అందిస్తూ విద్యను సరుకుగా మార్చి లాభాలు ఆర్జిస్తున్నారు. దేశానికి సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికులు, శ్రామికుల పిల్లలకు ప్రభుత్వ రంగ విద్య మిగిలింది. ప్రభుత్వాలు ఆయా పాఠశాలల్లో సౌకార్యలు, సరిపోయిన ఉపాధ్యాయులను కూడా ఇవ్వడం లేదు. అనేక పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టల్స్‌లో టాయిలెట్స్‌ కొరత ఉంది. గత రెండు సంవత్సరాల కాలంగా తెలంగాణ ప్రభుత్వం స్కావెంజర్స్‌ని నియమించట్లేదు. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా మారి అనేక కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సుమారుగా 2 లక్షల మంది విద్యార్ధులు చేరారు. కానీ ఉపాధ్యాయుల కొరత, మౌలిక సౌకర్యాల లేమి, పారిశుధ్య లోపం చూసి లక్ష కంటే ఎక్కువ మంది తిరిగి ప్రయివేటు పాఠశాలలకు వెళ్లిపోయారు.
పాఠశాలలు: వాస్తవానికి పాఠశాల విద్యాశాఖలో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు తెలంగాణలో ఉంటే ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 19.043 మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,947 గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌, 2,162 పీఎస్‌, హెచ్‌ఎం, 5870 స్కూల్‌ అసిస్టెంట్‌ కలిపి 9979 పోస్టులకు పదోన్నతులు ఇస్తే (70శాతం) మిగిలిన 30శాతం అంటే 8616 పోస్టులు ఖాళీ అవుతాయి. మొత్తంగా 15,228 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలి. కానీ 5089 ఉపాధ్యాయ, 1523 ప్రత్యేక టీచర్‌ పోస్టుల భర్తీకి మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వేల మంది టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు టీచర్‌ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం ఆ ఉద్యోగాలు ఎన్ని తగ్గించాలా అని ఆలోచిస్తుంది.
మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, ఖర్చు పెట్టిన బిల్లులను 5, 6 నెలలకు కూడా చెల్లించడం లేదు. ఆ కార్మికులు తమ బంగారాన్ని కుదవపెట్టి మరీ విద్యార్ధుల ఆకలి తీరుస్తున్న దయనీయ పరిస్థితులు మారేదెన్నడో?
కళాశాలలు, యూనివర్సిటీలు : ‘నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అనేది యూనివర్సిటీలకు సరిగ్గా వర్తిస్తుంది. కానీ ఆ యూనివర్సిటీలనూ, విద్యార్థులపై దాడులు చేసి వారి భావాలనూ, ఆలోచనలనూ వికసించనీయకుండా భయంతో బతికేలా చేసిన కేంద్ర ప్రభుత్వ దాడులను ఎవరూ మర్చిపోలేరు. పోనీ కనీస వసతులు, అధ్యాపకుల బోధనైనా వుందా అంటే అదీ లేదు. ఏప్రిల్‌ 2022 నాటికి సెంట్రల్‌ యూనివర్సిటీలలో మొత్తం 6,549 అధ్యాపక ఖాళీలు, ఐఐటి, ఐఐఎమ్‌, ఎన్‌ఐటి లలో మొత్తం 13,812 ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు వున్నాయి. దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాలను ఉద్దేశ్యపూర్వకంగా నీరు గార్చే చర్యలే కదా! యు.జి.సి నీ, గ్రాంట్స్‌నీ నిలిపివేశారు. హాస్టల్‌ ఫీజులు పెంచారు. మెస్‌లలో మంచి భోజనానికి, మౌలిక సౌకర్యాలకు నిధులు కోత ఎవరి ప్రయోజనాల కోసం?
బ్రిటీష్‌ వాళ్లు మన విద్యకు సరిపోయే నిధులు ఇవ్వక పోతే రాధాకృష్ణన్‌ గారు విశ్వవిద్యాలయ సొంత భవనాలు, తరగతి గదుల కోసం రాజులు, మహారాజుల నుండి విరాళాలు సేకరించి అభివృద్ధి చేశారు. కానీ స్వాతంత్య్రం తెచ్చుకున్న తర్వాత విద్యకు ప్రాధాన్యత పెరగాలి కదా?!
1964 – 66 సంవత్సరంలో భారతదేశ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి భవిష్యత్‌ విద్యావ్యవస్థ కోసం కొఠారి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులోనూ నూతన విద్యావిధానం (ఎన్‌.ఇ.పి) లోనూ విద్యను బలోపేతం చేయడానికి స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)లో 6 శాతం కేటాయించాలి అని తీర్మానించారు. కానీ 2015 నుంచి ఈ సంవత్సరం వరకు 2.8 నుండి 2.9 శాతం మాత్రమే బడ్జెట్‌ కేటాయింపు చేస్తుంది కేంద్రం. మన కన్నా చిన్న దేశాలైన బ్రెజిల్‌, నార్వే, చిలీ లలో 6.6 శాతం, ఇజ్రాయిల్‌, న్యూజిలాండ్‌ లలో 6.2 శాతం, ఇంగ్లాండ్‌లో 6.1 శాతం, అమెరికా 6 శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
ఉపాధ్యాయులు : ఉపాధ్యాయులు బోధనలో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ, అధ్యాపక కొరత మూలంగా వారికి అదనపు భారం పడుతుంది. ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల వల్ల జీతం తక్కువ, పని ఎక్కువ అవుతుంది. వివిధ శిక్షణా తరగతులతో రకరకాల అంశాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో సైతం విపరీతమైన పని, తక్కువ వేతనంతో యాజమాన్యాలు లాభాలు ఆర్జిస్తున్నారు. విద్యార్థులకూ, దేశ భవిష్యత్‌కు ఎలాంటి కరిక్యులమ్‌ అవసరం అనే అంశాల కంటే తమ ఆధిపత్యాన్ని, ఒక మత భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. లౌకిక, ప్రజాస్వామ్య భావాల రక్షణకై, దేశ భవిష్యత్తుని సమగ్రంగా తీర్చిదిద్దడానికి స్వేచ్ఛా భావాలు ప్రకటించనీయాలి. ఉపాధ్యాయులు తమ విద్యుక్త ధర్మాన్ని మరువక విలువలతో కూడిన విద్యను నేర్పాలి.
– జి. వందన, 9490120210