ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లు సమానమే

Alugubelli_Narsi_Reddy copy– ఎంఈవో, డిప్యూటీఈవో ఇతర పోస్టులకు పదోన్నతులివ్వాలి : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలు (లోకల్‌ బాడీ) ఉపాధ్యాయులను కూడా లోకల్‌ క్యాడర్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. 2015 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులు సమానమేనని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు (ఎంఈవో), ఉప విద్యాధికారులు (డిప్యూటీఈవో), డైట్‌ లెక్చరర్లు, బీఈడీ కాలేజీల లెక్చరర్లు, ఎస్‌సీఈఆర్టీలో బోధనా పోస్టుల్లో వెంటనే పదోన్నతులను కల్పించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి తగు ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులను లోకల్‌ క్యాడర్‌గా ప్రకటించారని తెలిపారు. కానీ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల సర్వీసులను లోకల్‌ క్యాడర్‌గా ప్రకటించలేదని పేర్కొన్నారు. దీంతో ఆ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రధాన ఆటంకంగా ఉందంటూ 2015, సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులు లోకల్‌క్యాడర్‌గా ప్రకటించారని తెలిపారు. దీంతో రెండు యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల ఉమ్మడి జాబితా ద్వారా ఆయా పోస్టుల్లో పదోన్నతులను అమలు చేయాలని కోరారు. పదోన్నతులిచ్చే విధంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.