నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు ప్రైమరీ స్కూల్ అబ్దుల్ అలీ అనే ఉపాధ్యాయుడు గత మూడు సంవత్సరాల నుండి పాఠశాలకు విధులకు వెళ్లకుండా ఉంటున్నాడని అతనిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాగటి రవితేజ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తూరు పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాగటి రవితేజ మాట్లాడుతూ మండలంలోని పాఠశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగిందని, ఈ సర్వేలో అనేకమైన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో అబ్దుల్ అలీ సార్, గత మూడు సంవత్సరాల నుండి తన సొంత పనుల నిమిత్తము ఇంటి వద్దనే ఉంటున్నాడని తెలిపారు. కొత్తూరు గ్రామములో పోస్టింగ్ ఉంటే డీఈఓ ఆఫీసులో డిప్యూటేషన్ పై డ్యూటీ చేస్తున్నట్లు రికార్డులో ఉన్నారని మండిపడ్డారు. విద్యార్థిని విద్యార్థులకు రాసుకోవడానికి క్లాస్ బోర్డు, వంట చేసుకోవడానికి వంట భవనం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. ఇలా ఉంటే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎలా చదువుకోంటారని అన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిశీలించి అట్టి ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకొని కొత్తూరు విద్యార్థులకు న్యాయం చేసి, వెంటనే విద్యార్థుల సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.